
Singer Sunitha vs Chinmayi:ప్రముఖ గాయని సునీత ఉపద్రష్ట ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
మహిళల స్వేచ్ఛ, ఫెమినిజం గురించి ఆమె చెప్పిన మాటలపై గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది.
సునీత చెప్పిన మాటల తర్వాత చిన్మయి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసాయి. ఈ వివాదంపై తాజాగా సునీత స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో వీడియోలు విడుదల చేసి చిన్మయికి సమాధానం ఇచ్చారు. చిన్మయిపై తనకు గౌరవం ఉందని, అయితే తన మాటలను పూర్తిగా వినకుండా తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.
'మై బాడీ, మై విష్' అనే నినాదం అర్థం తనకు పూర్తిగా తెలుసని సునీత చెప్పారు. ఒక మహిళ తన శరీరంపై తనకే హక్కు ఉండాలని చెప్పే నినాదాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. కానీ సమాజంలో ఇంకా మహిళలను చూసే తీరు మారలేదనే ఉద్దేశంతోనే తాను "అతని కళ్లూ అతని ఇష్టం" అని చెప్పానని వివరించారు.
అలాగే, ఒక వ్యక్తి మహిళపై చేయి చేసుకుంటే మాత్రం తాను అస్సలు సహించనని సునీత అన్నారు. "నా చేయి నా ఇష్టం" అంటూ మహిళపై దాడి చేయడానికి ఎవరూ ప్రయత్నిస్తే అలాంటి చేతులను విరగ్గొట్టాల్సిందేనని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.
చిన్మయి మహిళల కోసం చేస్తున్న పోరాటాన్ని తాను గౌరవిస్తానని కూడా సునీత చెప్పారు. తన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, మహిళల బాధ ఏమిటో తనకు తెలుసని అన్నారు. అందుకే తన మాటలను పూర్తిగా చూసి తర్వాతే అభిప్రాయం చెప్పాలని కోరారు.
ఈ వివాదానికి కారణమైన ఇంటర్వ్యూలో సునీత మహిళల భద్రత గురించి మాట్లాడారు. సమాజం పూర్తిగా మారే వరకు మహిళలు తమ భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని మాత్రమే తాను చెప్పానని వివరించారు. ఇక చిన్మయి మాత్రం సునీత వ్యాఖ్యలు మహిళలకు తప్పుడు సందేశం ఇస్తాయని అభిప్రాయపడ్డారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు మహిళలు ఎలాంటి దుస్తులు ధరించినా వేధింపులు ఎదుర్కొంటున్న సంఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. దీంతో ఇద్దరు ప్రముఖ గాయనుల వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.