
పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సరఫరాపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది.
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం, హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో దిగుమతుల పరిస్థితి మెరుగుపడటమే ఈ నిర్ణయానికి కారణమని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది.సంక్షోభం సమయంలో నిలిపివేసిన బల్క్ ఎల్పీజీ సరఫరాలను కూడా ఇప్పుడు 50 శాతం మేర పునరుద్ధరించారు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు ఉపశమనం లభించనుంది. పశ్చిమాసియా సంక్షోభం సమయంలో దేశీయ వినియోగదారులకు ఎలాంటి కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎల్పీజీ ఉత్పత్తి కోసం అవసరమైన C3-C4 గ్యాస్ వనరులను ఇతర రంగాలకు మళ్లించకుండా, పూర్తిగా గృహ వినియోగ ఎల్పీజీ తయారీకి కేటాయించింది. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో ఆ పరిమితులను కూడా సడలించింది.అయితే దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు కనీసం 40 వేల మెట్రిక్ టన్నుల కంటే తగ్గకుండా చర్యలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. అదే సమయంలో పెట్రోకెమికల్ రంగం అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని C3-C4 వనరుల కేటాయింపును పెంచనుంది. ఇక పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) విస్తరణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే ఈ గ్యాస్ వినియోగిస్తున్న వాణిజ్య సంస్థలు అదే విధానంలో కొనసాగుతాయని స్పష్టం చేసింది. నెట్వర్క్ అందుబాటులో ఉన్న ఇతర వినియోగదారులను కూడా దశలవారీగా పీఎన్జీ వైపు మళ్లించనున్నట్లు తెలిపింది.