కేంద్ర ప్రభుత్వం పాస్పోర్ట్ ఫీజుల్లో భారీగా మార్పులు చేసింది. 36 పేజీలతో కూడిన పాస్పోర్ట్ ఫీజు రూ.1500 ఉండగా.. దానిని రూ.2,500కు పెంచింది. రూ.3,500లుగా ఉన్న తత్కాల్ పాస్పోర్ట్ ఫీజు వేలు రూ.
5 వేలు చేసింది. ప్రస్తుతం రూ.2000గా ఉన్న 60 పేజీల పాస్పోర్ట్ కు ఇకపై రూ.3,500 వసూలు చేయనున్నారు. ఇదే తత్కాల్లో అయితే రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే, 18ఏళ్లలోపు దరఖాస్తుదారులకు కొత్త పాస్పోర్ట్ ఫీజు ప్రస్తుతం రూ.1000 ఉంది. ఇప్పుడు దానిని రూ.1,750కి, తత్కాల్ రూ.4,250కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే వీరి పాస్పోర్ట్ పోగొట్టుకున్నా లేదా దెబ్బతిన్నా కొత్తది జారీ చేయడానికి రుసుము సాధారణ కేటగిరీ కింద రూ. 4,250, తత్కాల్ కింద రూ. 6,750 గా నిర్ణయించింది. ఈ సవరించిన ఫీజులు జులై 1 నుంచి అమలులోకి రానున్నట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. జులై 1న లేదా ఆ తర్వాత సమర్పించిన అన్ని పాస్పోర్ట్ దరఖాస్తులకు సవరించిన ఫీజుల విధానం వర్తిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. పాస్పోర్ట్స్ చట్టం 1967లోని సెక్షన్ 24 కింద జూన్ 20న జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ప్రయాణ పత్రాలు, పాస్పోర్ట్ సంబంధిత సేవల ఛార్జీలు కూడా మారుతాయి. భారత్లో అత్యవసర ధ్రువపత్రాలు (ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు) ఉచితంగా జారీచేస్తారు. అయితే, విదేశాలలో దరఖాస్తు చేసుకుంటే 15 డాలర్లు ఛార్జ్ చెల్లించాలి. సర్టిఫికెట్ ఆఫ్ ఐడెంటిటీ ధర భారత్లో రూ. 1,000, విదేశాలలో 50 డాలర్లుగా ఉంటుంది. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్లు (PCC), సరెండర్ సర్టిఫికేట్లు, గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ వెరిఫికేషన్, ఇతర పాస్పోర్ట్ సంబంధిత ధ్రువపత్రాల ఫీజును భారత్లో రూ. 750, విదేశాలలో 40 డాలర్లుగా నిర్ణయించారు. చివరిగా పాస్పోర్ట్ ఫీజుల సవరణ 2012లో జరిగింది. అప్పుడు ప్రభుత్వం ప్రామాణిక 36-పేజీల పాస్పోర్ట్ ఫీజును రూ. 1,000 నుంచి రూ. 1,500కి, తత్కాల్ ఫీజును రూ. 2,500 నుండి రూ. 3,500కి పెంచింది.ఇదిలా ఉండగా, పాస్పోర్ట్ పౌరసత్వాన్ని రుజువు చేసే పత్రం కాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో చెల్లుబాటయ్యే 12 పత్రాల్లో పాస్పోర్ట్ కూడా ఒకటని స్పష్టం చేసింది. ఇటీవల బిహార్, అసోం, పశ్చిమ్ బెంగాల్, తమిళనాడులో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలోనూ ఓ గుర్తింపు పత్రంగా పాస్పోర్టు కూడా ఉందని, అందులో ఎటువంటి మార్పు లేదని పేర్కొంది.