లోహగఢ్ కోట వద్ద కాబోయే భార్య, ఆమె ప్రియుడి కుట్రలకు బలైపోయిన పుణేకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా, జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్‌ను తోసేసిన తర్వాత జరిగిన సంఘటన గురించి అక్కడి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తోన్న ధీరజ్ యాదవ్ వెల్లడించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడకు వెళ్లి ఏం జరిగిందని అడితే.. ఒకరు లోయలో పడిపోయారని చెప్పిందని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పాడు.‘‘అరుపులు విని నేను పరుగెత్తుకుని వెళ్లాను.. సియా గోయల్‌ను ఏం జరిగింది అని అడిగితే.. ఒకరు కోటపై నుంచి పడిపోయారు అని చెప్పింది.. వెంటనే ఈ విషయం పోలీసులకు చెప్పారు’’ అని ధీరజ్ పేర్కొన్నారు. ఆమె ‘హెల్ప్.. హెల్ప్’ అని అరిచిందని చెప్పారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌తో పాటు కోటవద్ద 24 గంటల సెక్యూరిటీ ఉంటుందని అన్నారు. కొన్నిసార్లు నెట్వర్క్ సమస్యల వల్ల సమాచారం సరిగ్గా అందదని తెలిపారు.మొదట ఏమి చూశారని అడిగితే.. తాను ఉన్న చోట దూరం నుంచి అరుపులు వినిపించాయని అతడు వివరించాడు. ‘ఆ ప్రాంతం వైపు పరుగెత్తి పర్యాటకుల వద్దకు చేరుకున్నాక, ఏమైందని అడిగా... ఎవరో కింద పడిపోయారని సియా గోయల్ చెప్పింది. ఆ క్షణంలో ఆమె మరిన్ని వివరాలు చెప్పలేదు.. ఆ తర్వాత వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను’అని పేర్కొన్నాడు.సియా గోయల్ ప్రవర్తన గురించి ప్రశ్నించగా.. ఆమె పదేపదే సహాయం కోసం పిలుస్తోందని గార్డు బదులిచ్చాడు. తాను మరిన్ని ప్రశ్నలు అడగడానికి సమయం వృథా చేయకుండా, అధికారులను సంప్రదించడంపైనే దృష్టి పెట్టానని అతను చెప్పాడు. హత్య, నేరపూరిత కుట్ర ఆరోపణలపై పోలీసులు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలను అరెస్టు చేశారు. ఈ జంట కేతన్ అగర్వాల్‌ను కోట పైనుంచి తోసివేసి చంపారని, మొదట ఈ ఘటనను ట్రెక్కింగ్ సమయంలో ప్రమాదవశాత్తు కిందపడినట్లుగా చిత్రీకరించారని పోలీసులు ఆరోపించారు.సియా, చేతన్ మధ్య గత ఆరు నెలల నుంచి సంబంధం కొనసాగుతోందని, ఇరువురు 2004 సార్లు ఫోన్ కాల్స్ చేసుకుని, 238 గంటల మాట్లాడారని పోలీసులు తెలిపారు. కొన్నిసార్లు రెండు లేదా మూడు గంటలకుపైగా మాట్లాడుకునేవారని కాల్‌డేటా ద్వారా గుర్తించారు. హత్య జరిగిన రోజు జూన్ 18న సియా, చేతన్‌లు పుణేలోని ఓ కేఫ్‌లో కలుసుకుని, కోటలోని ఏ ప్రదేశం కేతన్‌ను తోసేయడానికి అనుకూలంగా ఉంటుందనేది సహా తమ ప్లాన్ గురించి చర్చించుకున్నారని పోలీసులు తెలిపారు.