
ఫోక్ డాన్సర్ నాగదుర్గ.. ఫోక్ సాంగ్స్ తో పాపులర్ అయిన విషయం తెలిసిందే. జానపద పాటల్లో ఆమె చేసే డాన్సులు చూస్తే ఊగిపోవాల్సిందే. ఎలాంటివారైనా డాన్సులు చేసేలా ఆమె స్టెప్పులుంటాయి.
యూట్యూబ్‌లో ఫోక్ స్టార్‌గా రాణిస్తోన్న నాగదుర్గ ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె హీరోయిన్గా సినిమా ప్రారంభమైంది. `ఇడుపు కాయితం` పేరుతో గురువారం ప్రారంభమైన ఈ మూవీలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నారు. బన్నీవాసు, తబితా సుకుమార్ నిర్మిస్తున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ఈ మూవీ రూపొందుతుంది. వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు.
ఇందులో నాగదుర్గ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు నిర్మాత బన్నీవాసు. హీరోయిన్గా ఆమెని తీసుకోవాలంటే 15 కండీషన్స్ పెట్టిందట. ఒక తెలుగు అమ్మాయి సినిమా చేస్తే ఎలా ఉంటుందో, ఎంత సెలక్టీవ్‌గా ఉంటుందో అర్థమైందని, ఇలా ప్రతి విషయంలో కాన్ఫిడెంట్‌గా, తనకు ఏం కావాలో అంత క్లారిటీగా ఉందని చెప్పాడు బన్నీవాసు. ఆయన మాట్లాడుతూ, నేను సుకుమార్ కలిసి సినిమా నిర్మిస్తుంటే ఎవరైనా హ్యాపీగా వచ్చి చేస్తారనుకున్నా. కానీ నాగదుర్గ మాకు 15 కండీషన్స్ పెట్టింది. తెలుగమ్మాయి ఒక సినిమా చేస్తుంటే ఏం చేయగలను, ఏం చేయలేను అని ఎంత క్లారిటీగా ఉంటుంది అనేది నాగదుర్గతో మాట్లాడిన తర్వాత అర్థమైంది. నాగదుర్గ ఇప్పటికే యూట్యూబ్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె కోసం ఒక స్పెషల్ ట్యూన్ చేయిస్తున్నాం. ఆ డ్యాన్స్ నెంబర్ కు స్క్రీన్స్ చిరిగిపోతాయి` అని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, `ఇడుపు కాయితం"తో ఒక మంచి తెలుగు సినిమా చూడబోతున్నాం. సబ్ టైటిల్స్ తో బిహార్ లో వేసినా అక్కడ ప్రేక్షకులు కూడా చూసే చిత్రమిది. మన అందరి ఇళ్లలో ఒక కామన్ ప్రాబ్లమ్ ఉంటుంది. అది పెళ్లయిన వారికి తెలుసు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అమ్మాయి అయితే వాళ్ల అత్తామామను తీసుకుని థియేటర్ కు వెళ్లండి, అబ్బాయి అయితే అత్తామామను తీసుకుని విడిగా థియేటర్ కు వెళ్లండి. బయటకు వచ్చాక మీ అత్త మీ చేతులు పట్టుకుంటుంది. అల్లుడి చేతులు మామగారు పట్టుకుంటారు. అంతవరకు ఈ కథను చెప్పగలను. జమ్మికుంట నుంచి వచ్చాడు వంశీ. నేను ఆ ఊరు వెళ్లలేదు గానీ ఆయన కథ చెబుతుంటే ఊరు కళ్లముందు కనిపించింది. అంత బాగా కథ చెప్పాడు. ఈ సినిమా కథను మా దగ్గరకు తీసుకొచ్చి మేమంతా కలిసి ఈ మూవీ చేసేలా చేసింది ప్రియదర్శి. ఈ మూవీ ఇక్కడిదాకా వచ్చేందుకు వేణు ఊడుగుల, జగన్, పూజారి నాగేశ్వరరావు హెల్ప్ చేశారు. వాళ్లకు థ్యాంక్స్ చెబుతున్నా` అని అన్నారు.
హీరోయిన్ నాగదుర్గ మాట్లాడుతూ, `యూట్యూబ్ లో నా పాటలు చూసి విని ఉంటారు. ఇప్పుడు `ఇడుపు కాయితం` అనే అద్భుతమైన మూవీతో మీ ముందుకు హీరోయిన్ గా వస్తున్నాను. ఇండస్ట్రీకి హీరోయిన్ గా రావాలని ఎంతోమంది అమ్మాయిలు కోరుకుంటారు. మీ అందరి సపోర్ట్ తో నాకు ఈ రోజు అవకాశం వచ్చింది. నేను ఈ స్టోరీని నమ్మాను. నన్ను ఈ స్టోరీ నమ్మింది. వంశీ గారు కథ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఈ అవకాశం కల్పించిన బన్నీ వాస్ గారికి, సుకుమార్ గారికి థ్యాంక్స్. వాళ్లను కలిసినప్పుడు నా పాటలు చూస్తాం, అభిమానిస్తాం అని చెప్పారు. టాలెంట్ ఎక్కడున్నా అది చేరుకోవాల్సిన చోటుకి చేరుకుంటుంది, దక్కాల్సిన గుర్తింపు తీసుకొస్తుంది అని అన్నారు. వారి మాటలతో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ కథలో నేను చేస్తున్న శ్రీలత అనే పాత్ర చాలా బరువైంది. నా 25వ బర్త్ డే సుకుమార్ గారి సమక్షంలో జరుపుకోవడం మర్చిపోలేను. ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తూ రచ్చ రచ్చ చేసేస్తారు అని చెప్పగలను` అని తెలిపింది.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, `నేను గర్వంగా ఫీలయ్యే రోజు ఇది. మీరు నాపై చూపించిన ప్రేమను ఈ సినిమా ద్వారా తిరిగి మీకు అందించబోతున్నా. ఈ సినిమాలో శ్రీనివాస్ అనే పాత్రలో కనిపించబోతున్నా. ఈ పాత్ర కోసం నేను ఏం చేయాలో అదంతా చేస్తాను. ఇది తెలంగాణ నేపథ్య సినిమా అయి ఉండొచ్చు. తెలంగాణ భాష, యాస, తిండి, బట్ట అంతా కనిపించవచ్చు కానీ గర్వంగా చెప్పగలను ఇది ఒక గ్లోబల్ స్థాయి సినిమా. ఈ సినిమాను మేము జమ్మికుంట, ఇల్లంతకుంట, హైదరాబాద్, సనత్ నగర్ ఎక్కడ చిత్రీకరించినా, ఈ కథ మూలాలు ప్రతి ఇంట్లో ఉంటాయి. ఇది నా ఇంట్లో ఉన్న కథ. వంశీ ఈ కథ చెప్పినప్పుడు ఇది నా కథ అని నమ్మాను. అలాగే మా టీమ్ అంతా నమ్మారు. మాటల్లేవ్, సినిమాతో మాట్లాడతాం` అని చెప్పారు.