
విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే కాకుండా, టాలీవుడ్ క్లాసిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతమైన మాటలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ సినిమాతోనే దివంగత నటి ఆర్తి అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఆమె తన నటనతో, క్యూట్‌నెస్‌తో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ఈ చిత్రం ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. నువ్వు నాకు నచ్చావ్’ చిత్రానికి అతిపెద్ద బలం త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్. ఇందులోని “మనకి బాగా నచ్చినవాళ్లతో గొడవపడటమే కానీ, వాదనకు దిగకూడదు”, “నువ్వు గెలవడం అంటే పక్కవాడు ఓడిపోవడం కాదు” వంటి సంభాషణలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. ఈ సినిమాతోనే మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు.
అలాగే కమెడియన్ సునీల్‌కు ఈ చిత్రం ఒక బిగ్ బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. ‘బంతి’ పాత్రలో సునీల్ పండించిన కామెడీ, వెంకటేష్‌తో ఆయన కాంబినేషన్ సీన్స్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించాయి. ఈ సినిమా విజయం తర్వాత సునీల్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా మారారు. కోటి స్వరపరిచిన ఈ సినిమా పాటలు మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి. “ఆకాశం దిగివచ్చి”, “ఉన్నమాట చెప్పనీవు”, “నా చూపే నిను” వంటి పాటలు ఇప్పటికీ శ్రోతల ప్లేలిస్ట్‌లో లూప్‌లో వినిపిస్తూనే ఉంటాయి. అప్పట్లో ఈ సినిమా నిడివి దాదాపు మూడు గంటలు. కానీ ఈ సినిమా ప్రివ్యూ చూసి మూడు గంటలా.. సుహాసిని సీన్స్ కట్ చేసేయండి.. రెండున్నర గంటలకు తగ్గించండి అని గోల చేశారట. కానీ నిర్మాత స్రవంతి రవికిషోర్ మాత్రం కథపై నమ్మకంతో ఒక్క సీన్ కూడా కట్ చేయకుండా అలాగే సినిమాను మూడు గంటలు రిలీజ్ చేశారు. అయినా ప్రేక్షకులు ఏమాత్రం విసుగ్గా ఫీల్ కాకుండా సినిమాను ఎంజాయ్ చేశారు.
ఈ బ్లాక్‌బస్టర్ చిత్రానికి కథ, సంభాషణలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్, కథ పుట్టుక వెనుకటి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. త్రివిక్రమ్ తన రచన ప్రయాణంలో ఎదుర్కొన్న ఒత్తిడిని వివరిస్తూ, వెంకటేశ్ కోసం కథ రాయాల్సిన సమయంలో తాను ఒక నెల రోజుల పాటు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. ఈ సమయంలో దర్శకుడు కె. విజయ భాస్కర్ తో పాటు, సహచరులు కూడా తనను ప్రశాంతంగా ఉండమని, సమయం తీసుకొని కథను సిద్ధం చేయమని ప్రోత్సహించారని ఆయన గుర్తుచేసుకున్నారు. దాదాపు 20 నుంచి 30 రోజుల పాటు, తాను, భాస్కర్ కలిసి కూర్చున్నా, ఎలాంటి ఆలోచనలు రాలేదని, కేవలం తినడం, పడుకోవడం తప్ప మరేమీ జరగలేదని త్రివిక్రమ్ హాస్యంగా పేర్కొన్నారు.
అయితే, ఒక రోజు హఠాత్తుగా, ఒక కలలాంటి అనుభూతిలో కథాబీజం తన మదిలో మెరిసిందని త్రివిక్రమ్ వివరించారు. ఆయనకు తట్టిన మొదటి ఆలోచన ఏమిటంటే: “ఒక కాలనీలో ఒక అమ్మాయి నిశ్చితార్థం జరుగుతోంది. అదే కాలనీలో, వారి ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో హీరో, అతని తండ్రి అద్దెకు దిగుతారు. అమ్మాయి తల్లిలేని కారణంగా, ఆమె పెళ్లికి పాలు తీసుకురావడానికి హీరో వారి ఇంటికి వెళ్ళినప్పుడు, ఆమెకు నిశ్చితార్థం జరుగుతోందని తెలుస్తుంది. అక్కడి నుంచే వారిద్దరి పరిచయం, ఆపై ప్రేమకథ మొదలవుతుంది.” ఈ ఆలోచన వినగానే, సాధారణంగా సినిమా క్లైమాక్స్ లేదా ప్రీ-క్లైమాక్స్ సన్నివేశంగా నిశ్చితార్థం ఉండగా, దాన్ని సినిమా ప్రారంభంలోనే పెట్టడం ఎంత కష్టమని, దానిపై మిగతా కథను ఎలా నడుపుతావని ఎదుటివారు ప్రశ్నించారని త్రివిక్రమ్ గుర్తుచేసుకున్నారు. ఈ అద్భుతమైన ఆలోచన తట్టిన తర్వాత, మిగిలిన కథ మొత్తం కేవలం 10-15 రోజుల్లోనే వేగంగా రూపుదిద్దుకుందని త్రివిక్రమ్ చెప్పారు. అయితే, ఆ తర్వాత కథలో కొన్ని మార్పులు జరిగాయని, ఉదాహరణకు, హీరో కాలనీలోకి దిగడం కాకుండా, వారి తండ్రులు స్నేహితులని చూపించారని ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా నువ్వు నాకు నచ్చావ్ వంటి ఒక క్లాసిక్ సినిమా కథ అనేక మలుపులు తిరిగి, ఒత్తిడి, అద్భుతమైన ప్రేరణల కలయికతో రూపుదిద్దుకుంది.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..