Pune Nasrapur Rape Case : మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పూణె నస్రాపూర్ నాలుగేళ్ల మైనర్ బాలిక హత్యాచారం కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.
ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన తుది విచారణలో 65 ఏళ్ల నిందితుడు భీంరావ్ కాంబ్లేపై మోపబడిన అన్ని ఆరోపణలు నిజమేనని నిర్ధారిస్తూ.. కోర్టు అతడిని దోషిగా తేల్చింది. అయితే నిందితుడికి విధించబోయే శిక్షా నిబంధనలను న్యాయమూర్తి ఈ సందర్భంగా వివరించారు. ఈ నేరాలకు గాను చట్టంలో ఉరిశిక్ష, జీవిత ఖైదు లేదా కనీసం 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయని స్పష్టం చేశారు. అలాగే "నీకు ఏ శిక్ష వేయబోతున్నామో నీకు అర్థమైందా?" అని భీంరావ్‌ను నేరుగా ప్రశ్నించగా.. అతడు నోరు మెదపకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు.‘అరుదైన వాటిల్లో అత్యంత అరుదైన’ కేసంటూ..!నిందితుడికి ఉరిశిక్ష మాత్రమే సరైన న్యాయమని ప్రాసిక్యూషన్ కోర్టు ముందు అత్యంత బలమైన వాదనలు వినిపించింది. ఈ కేసులో నిందితుడు ప్రదర్శించిన క్రూరత్వం మానవత్వానికే సిగ్గుచేటని, అందువల్ల దీనిని అరుదైన వాటిల్లో అత్యంత అరుదైన కేటగిరీగా పరిగణించాలని కోరింది. నిందితుడి పైశాచికత్వానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని న్యాయస్థానానికి సమర్పించింది. ఆ నిందితుడు మే 1వ తేదీన చిన్నారిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేయడమే కాకుండా ఆమె చనిపోయాక కూడా అత్యాచారానికి ఒడిగట్టాడనే విషయాన్ని ఆధారాలతో సహా బయట పెట్టింది. ఈ భయంకరమైన వివరాలను కోర్టులో చదువుతున్నంత సేపూ బాధితురాలి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడి వారందరి చేత కంటతడి పెట్టించింది. గతంలోనూ ఇద్దరు బంధువలపై అత్యాచారం..సమాజంలో బతికే హక్కు లేని ఇటువంటి క్రిమినల్‌కు మరణశిక్షే ఏకైక మార్గమని ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. నిందితుడి ఈ నాలుగేళ్ల చిన్నారిని మాత్రమే కాకుండా.. గతంలోనూ ఇద్దరు బంధువులపై అత్యాచారం జరిపాడని కూడా తెలిపింది. ఒక వృద్ధురాలితో పాటు, 18 ఏళ్ల అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడినట్లు రెండు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. ఆ కేసుల్లో సాంకేతిక కారణాల వల్ల ఇతడు నిర్దోషిగా బయటపడినప్పటికీ.. ఇతని ప్రవర్తన సమాజానికి తీవ్ర ముప్పుగా మారిందని, ఇప్పుడు కూడా వదిలేస్తే మరిన్ని ఘోరాలకు పాల్పడే ప్రమాదం ఉందని ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.జూన్ 29న తుది శిక్ష ఖరారు..!ఈ కేసులో నిందితుడి ప్రమేయాన్ని నిరూపించడానికి ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, కీలకమైన వైద్య, ఫోరెన్సిక్ నివేదికలు, సీసీటీవీ ఆధారాలు అన్నీ స్పష్టంగా ఉన్నాయని, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా నేరం రుజువైందని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలను విన్న ప్రత్యేక న్యాయస్థానం.. నిందితుడికి విధించబోయే తుది శిక్షా కాలాన్ని రిజర్వ్‌లో పెట్టింది. జూన్ 29వ తేదీన అంటే సోమవారం రోజు ఈ 65 ఏళ్ల దోషికి శిక్ష విధించబోతుంది. మరి న్యాయస్థానం ఉరిశిక్షే వేస్తుందా, జీవితఖైదు విధిస్తుందా అనేది వేచి చూడాలి.