
హోస్పేట: నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని.. వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్తు తరాలకు భరోసా ఉంటుందని చెప్పారు.
కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు.
‘‘తుంగభద్ర.. మూడు రాష్ట్రాల్లో లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోంది. ఆరు నెలల్లో 33 గేట్లు అమర్చిన అందరినీ అభినందిస్తున్నా. కేంద్ర జలవనరులశాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ముగ్గురు సీఎంలు కలవడం ఓ చరిత్ర. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు తుంగభద్ర తాగు, సాగు నీరు ఇచ్చింది. ఈ నది లేకపోతే చాలా సమస్యలు వచ్చేవి. జలవనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ మనందరి బాధ్యత. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో నదుల అనుసంధానం చేయాల్సిన బాధ్యత ఉంది. గంగ, కావేరి నదులను అనుసంధానం చేస్తే భారత్ అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తుంది. సీఆర్ పాటిల్‌కు నదులు అనుసంధానం చేసిన అనుభవం ఉంది. జాతీయ ప్రాజెక్టుగా గోదావరి-కావేరిని కేంద్రం అనుసంధానం చేయాలి’’ అని చంద్రబాబు అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.