
భీకర జంట భూకంపాలు వెనెజువెలా దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ శతాబ్ద కాలంలోనే అత్యంత శక్తివంతమైనవిగా నమోదైన ఈ భూకంపాల విధ్వంసంపై భారత ప్రధానమంత్రి మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ... విపత్తు బాధితులకు, వెనెజువెలా ప్రభుత్వానికి భారతదేశం తరఫున ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కష్టకాలంలో వెనెజువెలాకు అవసరమైన అన్ని రకాల మానవీయ, వైద్య సహాయసహకారాలను అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు.
బుధవారం సాయంత్రం వెనెజువెలాలోని మోరోన్ నగరానికి పశ్చిమంగా కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే 7.2 మరియు 7.5 తీవ్రతతో ఈ జంట భూకంపాలు సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీని ధాటికి రాజధాని కరాకస్ సహా పలు నగరాల్లో వందలాది భవనాలు కుప్పకూలాయి. ఈ భూకంపం సృష్టించిన వైబ్రేషన్స్ దాదాపు 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్‌లోని అమెజాన్ అటవీ ప్రాంతం వరకు కూడా తెలిసివచ్చాయంటే దీని తీవ్రత ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భూకంపం సృష్టించిన నష్టంపై వెనెజువెలా తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ స్పందిస్తూ... పలు రాష్ట్రాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగిందని, రాజధానిలోని ప్రధాన విమానాశ్రయమైన ‘సిమోన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం’ తీవ్రంగా దెబ్బతినడంతో దాన్ని పూర్తిగా మూసివేశామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పాటు, పరిస్థితి దారుణంగా ఉండటంతో దేశంలోని హెల్త్ స్టాఫ్ (ఆరోగ్య సిబ్బంది) అందరూ అత్యవసర విధులకు హాజరుకావాలని ‘మెడికల్ ఎమర్జెన్సీ’ ఆర్డర్స్ జారీ చేశారు.