
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Hyderabad Free Breakfast: ఎందరికో ఆశ్రయాన్ని ఇవ్వడమే కాకుండా.. ఆకలితో అలమటించే వారికి ఇంత అన్నం పెట్టే సేవా నిలయంగా హైదరాబాద్ నిలవనుంది. అలాంటి ఒక గొప్ప సేవా దృక్పథంతో, గత కొంతకాలంగా నిరుపేదల ఆకలిని తీరుస్తోంది 'ఆహార్ సేవ' అనే స్వచ్ఛంద సంస్థ. ముఖ్యంగా కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో, ఎలాంటి విరామం లేకుండా సంవత్సరంలో 365 రోజులూ ఉచితంగా రుచికరమైన అల్పాహారాన్ని (టిఫిన్) అందిస్తూ ఈ సంస్థ నగర ప్రజల మన్ననలు పొందుతోంది.
ఈ అద్భుతమైన మహత్ కార్యానికి వ్యవస్థాపకుడు రంజన్ గాంధీ శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ ఉదయం 3 గంటల నుంచే వంటశాలలో టిఫిన్ల తయారీ ప్రారంభమవుతుంది. వర్షం పడినా, చలి వణికించినా, సెలవు రోజైనా ఈ సేవకు ఎటువంటి ఆటంకం కలగదు. సరిగ్గా ఉదయం 7:30 గంటలకల్లా పంపిణీ కేంద్రాల వద్దకు వేడివేడి ఆహారం చేరుకుంటుంది. నిరుపేదలు, రోజువారీ కూలీల కోసం ఇడ్లీ, బోండా, ఊతప్ప, ఉప్మా వంటి నాలుగు రకాల వైవిధ్యమైన, పోషకాలతో కూడిన టిఫిన్లను ఇక్కడ వడ్డిస్తారు.
ప్రస్తుతం ఈ సంస్థ తన సేవా పరిధిని కేవలం కాచిగూడకే పరిమితం చేయకుండా, హైదరాబాద్‌లోని మరో 5 నుంచి 6 కీలక ప్రాంతాలకు విస్తరించింది. నాంపల్లిలోని శ్యామ్ మందిర్ ఎదురుగా, నిలోఫర్ హాస్పిటల్ వద్ద, పబ్లిక్ గార్డెన్ సమీపంలో, నాంపల్లి సుభాన్ బేకరీ వద్ద, ఉస్మాన్‌గంజ్‌లోని బాలసదన్‌లో ఈ ఉచిత అల్పాహార కేంద్రాలు నడుస్తున్నాయి. వీటితో పాటు బేగంపేట్‌లోని దేవనార్ బ్లైండ్ స్కూల్, మలక్‌పేట్‌లోని డెఫ్ అండ్ డంబ్ పాఠశాలలకు కూడా సంస్థ నిత్యం అల్పాహారాన్ని సరఫరా చేస్తోంది.
ఇంత పెద్ద ఎత్తున ప్రతిరోజూ వేలాది మందికి నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి రోజుకు సుమారు రూ.20,000 వరకు ఖర్చు అవుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఖర్చంతా పూర్తిగా మానవతావాదులు, దాతలు అందించే విరాళాల ద్వారానే సమకూరుతోంది. కేవలం అల్పాహారమే కాకుండా, అనాథాశ్రమాలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల పాఠశాలలకు కూడా ఆహార్ సేవ నిరంతరం తోడ్పాటునందిస్తోంది.
ఆకలి లేని సమాజ స్థాపనే ధ్యేయంగా రంజన్ గాంధీ నాయకత్వంలో సాగుతున్న "ఆహార్ సేవ" ప్రయాణం నిజంగా అభినందనీయం. ఆకలితో ఉన్న పేదవాడి ముఖంలో ఈ సంస్థ నింపుతున్న నవ్వులు ఎందరికో స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కేంద్రాలు ఏర్పాటై, మరింత మంది నిరుపేదలకు ఆకలి బాధలు తప్పాలని ఆశిద్దాం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.