కొంతమంది ఇళ్లలో కోళ్లు, ఉడుతల్ని సరదాగా పెంచుకుంటారు. కొన్ని జంతువులు, పక్షుల్ని పెంచుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది.
ఇష్టం వచ్చినట్లుగా నిబంధనల్ని ఉల్లంఘించి జంతువులు, పక్షుల్ని పెంచుకుంటే చిక్కులు తప్పవు. శ్రీకాకుళానికి చెందిన యువకుడు కూడా కోళ్లు, ఉడుతల్ని తీసుకొచ్చి ఇంట్లో పెంచుతూ కష్టాల్లో పడ్డాడు. అటవీశాఖ అధికారులు అతడి ఇంట్లో సోదాలు చేసి చట్టాన్ని ఉల్లంఘించినందుకు కేసుమోదు చేసి అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.కుశాలపురానికి చెందిన పైడి పార్వతీరావు ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా వన్యప్రాణుల్ని పెంచుకుంటున్నంట్లు అటవీశాఖ అధికారులకు నాగ్‌పూర్‌కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందం అటవీశాఖకు సమాచారం పంపింది. వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు పార్వతీరావు ఇంట్లో సోదాలు చేశారు. మొత్తం 14 అడవి కోళ్లు, తిరుమల శేషాచల అడవుల్లో సంచరించే 4 మలబారు ఉడుతలు, నక్షత్ర తాబేలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వన్యప్రాణుల్ని పెంచుతున్నట్లు తేల్చారు.వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద పార్వతీరావుపై కేసు నమోదు చేశారు.. అతడ్ని కోర్టులో ప్రవేశపెడతామని జిల్లా అటవీశాఖ అధికారి ఎస్ వెంకటేష్ తెలిపారు. పార్వతీరావు ఇంట్లో స్వాధీనం చేసుకున్న అడవి కోళ్లు, మలబారు ఉడుతలు, నక్షత్ర తాబేళ్లను విశాఖపట్నం జూకు తరలిస్తామన్నారు. పార్వతీరావు ఈ వన్యప్రాణుల్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చారు.. వాటిని ఏ ఉద్దేశంతో ఇంట్లో ఉంచారో తెలుసుకునే పనిలో ఉన్నారు అటవీశాఖ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వన్యప్రాణుల్ని పెంచుకుంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.మన దేశంలో వన్యప్రాణులు, పక్షులు, వృక్షజాల రక్షణ కోసం వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972 రూపొందించారు. దేశంలో అంతరించిపోతున్న వన్యజీవుల వేటను అరికట్టడానికి, పర్యావరణ భద్రతను కాపాడటానికి ఈ చట్టం కీలకమైనదని చెబుతుంటారు. ఈ చట్టం ప్రకారం అంతరించిపోతున్న జంతువులు, పక్షులను వేటాడటం, హింసించడం, వాటిని బంధించడం పూర్తిగా నిషేధం. ఈ చట్టం ప్రకారం నేర స్వభావాన్ని బట్టి 3 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.