బిగ్‌బాస్ సీజన్ 10 సందడి మొదలైంది.. ఈసారి కూడా అగ్నిపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ అగ్నిపరీక్ష ద్వారా సామాన్యులకు కూడా బిగ్‌బాస్‌కు అవకాశం కల్పిస్తున్నారు.
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ తెలుగు రాష్ట్రాల నుంచి రిక్వెస్ట్‌లు మొదలయ్యాయి. ఈసారి బిగ్ బాస్-10లోకి వచ్చేందుకు రెడీ అంటూ ఓ పోలీస్ అధికారి వీడియోను సోషల్ మీడియాలోకి వదిలారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఎస్సై నాగార్జున గారు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు.. బిగ్ బాస్ సీజన్ 10లో తనకు అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలని ఉందంటూ నంద్యాల జిల్లా గడివేముల ఎస్సై నాగార్జున రెడ్డి ఓ వీడియో చేశారు. బిగ్‌బాస్‌లోకి సెలబ్రిటీలతో పాటుగా సామాన్యులకు కూడా అవకాశం ఇస్తూ ప్రతిభను వెలికితీస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. బిగ్ బాస్ షోలో ఒక్క అవకాశం ఇస్తే.. తన టాలెంట్ నిరూపించుకుంటానని ఎస్సై నాగార్జున రెడ్డి చెప్పుకొచ్చారు. తాను ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తినని.. బిగ్‌బాస్‌లోకి అడుగు పెట్టేందుకు అవకాశం కల్పించాలని కోరారు. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టడం చాల కష్టమని.. ఒకవేళ వెళ్లినా అక్కడ ఎన్నో కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఆ టాస్క్‌లు, కష్టాలను ఎదుర్కొని కచ్చితంగా ప్రజల మనసును గెలుచుకుంటానని చెప్పుకొచ్చారు. ఎస్సై నాగార్జున రెడ్డి స్వస్థలం కడప జిల్లా కాగా ప్రస్తుతం నంద్యాల జిల్లా గడివేముల ఎస్సైగా పనిచేస్తున్నారు. ఎస్సై పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొంతమంది ఎస్సైకు బిగ్‌బాస్‌లో ఛాన్స్ ఇవ్వాలని కోరుతుంటే.. మరికొందరు పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తి బిగ్‌బాస్ షోకు ఎలా వెళతారని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆయన ఇలా బిగ్‌బాస్‌కు వెళతానంటూ వీడియో చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ ఆయనకు బిగ్‌బాస్‌లోకి వెళ్లాలని ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లొచ్చంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ బిగ్‌బాస్‌లోకి ఎస్సై వెళ్లాలంటే చట్ట ప్రకారం సాధ్యమేనా.. ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలా.. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లాలా.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. మరి ఈ వీడియోపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది చూడాలి. మొత్తం మీద ఎస్సై నాగార్జున రెడ్డి బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున కంట్లో పడబోయి.. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా కంట్లో మాత్రం పడ్డారు.మరోవైపు తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే ప్రారంభం కానుంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో షో మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ అగ్నిపరీక్షకి ఆడిషన్స్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ గడువు కూడా ముగిసింది.. కానీ పెద్దగా స్పందన రాకపోవడంతో రెండో సారి గోల్డెన్ ఛాన్స్ అంటూ బిగ్ బాస్ టీం మరో అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఎస్సై వీడియో వైరల్ అవుతోంది.