
ఒడిశాలోని బోలంగిర్ జిల్లాకు చెందిన చండీప్రసాద్ ఝార్సుగూడ నుంచి హావ్‌డాకు వెళ్లేందుకు రైలు టిక్కెట్ బుక్ చేశారు.
సమయానికే రైలు గమ్యం చేరుకుంటుందని భావించి కోల్‌కతా విమానాశ్రయం నుంచి గౌహతికి వెళ్లే విమాన టిక్కెట్ బుక్ చేశారు. కానీ హౌరా చేరుకునే సరికి 7 గంటలు ఆలస్యమైంది. ఆయన విమానాన్ని అందుకోలేకపోయారు. మరో విమాన టిక్కెట్ కోసం అదనంగా చెల్లించాల్సి వచ్చింది. జరిగిన నష్టానికి పరిహారం కోరుతూ, రైల్వేకు లేఖ రాయగా స్పందించలేదు. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా.. పరిహారం, కేసు ఖర్చులన్నీ కలిపి రూ.55 వేలు చెల్లించాలని ఆదేశించింది. రైల్వేశాఖ ఈ ఉత్తర్వును అమలు చేయడంలో ఆలస్యం చేయడంతో రోజుకు రూ.500 చొప్పున అదనపు జరిమానా విధించింది.
హైదరాబాద్‌కు చెందిన రామచందర్‌రావు రైల్వేలో ఉద్యోగ విరమణ చేశారు. నగరం నుంచి బెంగళూరు వెళ్లే సమయంలో పట్టాల మరమ్మతుల కారణంగా రైలు రద్దయ్యింది. ఈ సమాచారం చెప్పక పోవడంపై ఆయన కమిషన్‌ను ఆశ్రయించగా.. పరిహారం చెల్లించాలని తీర్పు వెలువడింది.
భారతీయ రైల్వేలో వివిధ కారణాల వల్ల 3 గంటల వరకు ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయని ఆ శాఖ నిబంధనల్లో పేర్కొంది. అంతకు మించి ఆలస్యమైతే ప్రయాణికులకు కొన్ని హక్కులు లభిస్తాయి. ప్రయాణికుడు రిజర్వేషన్ టికెట్ పొంది ఉండాలి. జనరల్ టికెట్ తీసుకొని ప్రయాణించే వారికి ఇవి వర్తించవు.
సమయానికి గమ్యస్థానం చేరుకునే హక్కు రైల్వే ప్రయాణికులకు ఉంది. ఏవైనా విపత్తులు, తీవ్ర సాంకేతిక కారణాలతో తప్ప.. జాప్యం వల్ల నష్టపోతే రైల్వేలు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది
ఐఆర్సీటీసీ వెబ్సైట్లో లాగిన్ అయి ఫైల్ టీడీఆర్ ఎంపిక చేసి రీఫండ్ క్లెయిమ్ చేయాలనుకుంటున్న టిక్కెట్ పీఎన్ఆర్ నంబర్‌ను ఎంపిక చేయాలి. డ్రాప్ డౌన్ మెనూ నుంచి టీడీఆర్ ఫైల్ చేయడానికి కారణాన్ని ఎంచుకొని రీఫండ్ క్లెయిమ్ చేస్తున్న ప్రయాణికుల సంఖ్య తెలపాలి. ఫైల్ టీడీఆర్ బటన్‌ను క్లిక్ చేసి చివరిగా.. సూచనలన్నీ చదివి ‘ఎస్’ బటన్ క్లిక్ చేస్తే చాలు. ఫైలింగ్ విజయవంతమైందని సందేశం వస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.