
ఈనాడు, హైదరాబాద్: యాసంగి సీజన్ అనంతరం రాష్ట్రంలో 16.85 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలను రైతులు దహనం చేశారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రిమోట్ సెన్సింగ్, జియో...
ఈనాడు, హైదరాబాద్: యాసంగి సీజన్ అనంతరం రాష్ట్రంలో 16.85 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలను రైతులు దహనం చేశారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రిమోట్ సెన్సింగ్, జియో ఇన్ఫర్మేటిక్ సిస్టం ద్వారా దీనిని గుర్తించారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను వర్సిటీ బుధవారం ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్రంలో భారీఎత్తున జరుగుతున్న పంట వ్యర్థాల దహనంపై సర్వే చేయాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ వర్సిటీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెల మూడోవారం వరకు ఉపగ్రహ సాంకేతికత ద్వారా సర్వే నిర్వహించారు. అది విడుదల చేసిన ఛాయాచిత్రాల ఆధారంగా పంట వ్యర్థాల దహనం తీరును విశ్లేషించి, నివేదిక రూపొందించారు.
మూడు మాసాల్లో మొత్తం 74,80,171 ఎకరాల్లో పంటల కోతలు జరగగా.. 16,85,544 ఎకరాల్లో పంట వ్యర్థాలను దహనం చేశారు. ఈ ప్రక్రియలో నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో తక్కువగా దహనం జరిగినట్లు నివేదిక పేర్కొంది. పంట వ్యర్థాల కాల్చివేతతో ఆయా ప్రాంతాల్లో నేల ఆరోగ్యం, గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతిన్నట్లు సర్వే ద్వారా గుర్తించినట్లు వర్సిటీ తెలిపింది. సర్వే లెక్కల ప్రకారం 23.63 లక్షల కిలోల నత్రజని, 11.90 లక్షల కిలోల భాస్వరం, 1,062 లక్షల కిలోల పొటాష్ ఈ మూడు మాసాల్లోనే గాలిలో కలిసిపోయాయి. 60 కిలోల అతి ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్, 1,460 కిలోల కార్బన్ డై ఆక్సైడ్, 200 కిలోల బూడిద గాలిలోకి విడుదలయ్యాయి. ఉష్ణోగ్రత పెరుగుదలకి ప్రధాన కారణమైన మీథేన్, నైట్రోజన్ ఆక్సైడ్ వాయువులు భారీగా విడుదలయ్యాయని నివేదిక పేర్కొంది. పంట వ్యర్థాల దహనం పెనుముప్పుగా పరిణమించినందున.. నిరోధానికి వెంటనే చర్యలు చేపట్టాలని వీసీ అల్దాస్ జానయ్య ప్రభుత్వానికి నివేదించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.