
సత్యదేవ్ హీరోగా వెంకటేశ్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావుబహదూర్’పై నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహేశ్‌బాబు (Mahesh Babu) సొంత చిత్ర నిర్మాణసంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో రూపుదిద్దుకున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ (Rao Bahadur) చిత్రం జులై 3న విడుదలతోంది. సత్యదేవ్ (Satyadev) హీరోగా నటించిన ఈ సినిమాకు వెంకటేశ్ మహా (Venkatesh Maha) దర్శకుడు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన చింతా గోపాలకృష్ణారెడ్డి (Chinta Gopalakrishna Reddy) బుధవారం మీడియాతో ముచ్చటిస్తూ చిత్ర విశేషాలు వెల్లడించారు.
‘ఈ చిత్రకథను మొదట నమ్రత (Namrata Shirodkar) విన్నారు. ఆమెకు బాగా నచ్చింది. ఆ తర్వాత దర్శకుడు వెంకటేశ్ మహా నాకు కథ చెప్పారు. నాకు కూడా నచ్చడంతో ప్రాజెక్ట్ ప్రారంభమైంది. కథ మీద బాగా నమ్మకం ఉండడంతో బాగా ఖర్చు పెట్టి సినిమా తీశాం. నేటి ప్రేక్షకుల అభిరుచికు తగ్గట్లుగా కొత్తదనంతో సినిమా ఉంటుంది. ఇందులో హీరో పాత్రకు మొదటి నుంచీ సత్యదేవ్‌నే అనుకున్నాం. ‘రావు బహదూర్’ పాత్రకు ఆయన సరిగ్గా సరిపోయారు. ఈ సినిమా కోసం ఆయన రోజూ ఐదు గంటల పాటు మేకప్ చేసుకొనేవారు. సత్యదేవ్, మా దర్శకుడు వెంకటేశ్ మహా ఆలోచనలు చక్కగా కలిశాయి’ అని గోపాలకృష్ణారెడ్డి చెప్పారు.
ఇటువంటి కాన్సెప్ట్, మేకింగ్‌తో ఏ సినిమా ఇప్పటివరకూ రాలేదని చెబుతూ ‘మహేశ్‌బాబు సినిమా చూసి చాలా ఆశ్చర్యపోయారు. అద్భుతంగా వచ్చిందని ప్రశంసించారు. ఆయన కాంప్లిమెంట్ మా నమ్మకాన్ని మరింత పెంచింది. సినిమా అంతా ఒరిజినల్ లొకేషన్స్‌లోనే తీశాం. ఒడిశాలో ఓ కోటలో షూటింగ్ చేశాం. ఇంతవరకూ అక్కడ ఏ షూటింగ్ జరగలేదు. అలాగే సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్ అన్నీ ఒరిజినలే. దర్శకుడు వెంకటేశ్ మహాతో సినిమా తీయాలని నాకు ఎప్పటినుంచో కోరిక. ఆయన ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతారు’ అని చెప్పారాయన.