
IND vs ENG: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 చారిత్రాత్మక విజయానంతరం భారత క్రికెట్ జట్టు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది.
సరికొత్త లక్ష్యాలు, 2027 ప్రపంచకప్ రోడ్‌మ్యాప్‌తో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన యువ భారత్, అక్కడ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. శుక్రవారం జరగబోయే తొలి సమరంలో విజయమే లక్ష్యంగా శ్రేయస్ అయ్యర్ సేన బరిలోకి దిగుతోంది.
సరికొత్త శకం.. ఐర్లాండ్ గడ్డపై యువ భారతం తొలి అడుగు!
విశ్వవిజేతగా నిలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా, ఇప్పుడు భవిష్యత్తు జట్టును నిర్మించే పనిలో పడింది. ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ యాదవ్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్య వంటి సీనియర్ ఆటగాళ్లకు ఈ సిరీస్ నుంచి సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు. దీంతో ఐపీఎల్లో అదరగొట్టిన యంగ్ స్టార్స్‌కు ఇదొక సువర్ణావకాశంగా మారింది. నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో మంగళవారమే ఐర్లాండ్ విమానమెక్కిన భారత జట్టు, అక్కడ అడుగుపెట్టి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఈ సిరీస్ ద్వారా భారత క్రికెట్లో సరికొత్త శకం ఆరంభం కాబోతోంది.
15 ఏళ్ల వండర్ కిడ్‌కు తొలి మ్యాచ్‌లోనే నిరాశేనా..?
భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ఒకే ఒక్కడి పేరు మారుమోగుతోంది. అతడే 15 ఏళ్ల టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. ఈ అద్భుత బాలనటుడు అంతర్జాతీయ క్రికెట్లోకి ఎప్పుడు అరంగేట్రం చేస్తాడా అని యావత్ క్రికెట్ ప్రపంచం కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తోంది. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగే తొలి పోరులోనే వైభవ్ తుది జట్టులోకి వస్తాడని అందరూ ఆశించారు. అయితే, టీమిండియా మాజీ వికెట్ కీపర్, ప్రముఖ విశ్లేషకుడు సబా కరీమ్ మాత్రం అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడే అంతర్జాతీయ జట్టులో అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ సిరీస్ లోనూ ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మలనే కొనసాగించాలని కోరారు. ఇంగ్లాండ్ జట్టుపై వైభవ్ సూర్యవంశీని బెంచ్‌కే పరిమితం చేయాలని, అలా చేయడం వల్ల సీనియర్లతో ఎన్నో అనుభవాలను తెలుసుకుంటాడని తెలిపారు.
సబా కరీం ఊహించని జట్టు.. ఓపెనర్లుగా ఆ ఇద్దరే!
స్టార్ స్పోర్ట్స్ వేదికగా జరిగిన చర్చా కార్యక్రమంలో సబా కరీమ్ తొలి టీ20 కోసం తనదైన శైలిలో భారత తుది జట్టును ప్రకటించాడు. అందులో వైభవ్ సూర్యవంశీకి చోటు కల్పించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రపంచకప్ గెలిచిన జట్టులో అద్భుత ప్రదర్శన చేసిన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లనే ఓపెనర్లుగా కొనసాగించాలని ఆయన మొగ్గు చూపాడు. ఇక మిడిలార్డర్‌ను మరింత బలోపేతం చేస్తూ.. మూడో స్థానంలో ఇషాన్ కిషన్‌ను, నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశాడు. ఐదో స్థానంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు అవకాశం ఇచ్చాడు. సబా కరీం చేసిన ఈ ఎంపిక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సబా కరీం ఎంచుకున్న జట్టులో ఆల్‌రౌండర్ల పాత్ర చాలా కీలకంగా కనిపిస్తోంది. పేస్ ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబేను, స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లకు అవకాశం ఇచ్చాడు. ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లు పేస్ భారాన్ని మోయనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీని జట్టులోకి తీసుకున్నాడు. ఈ జట్టు సమతూకంగా ఉన్నప్పటికీ, సూర్యవంశీ లాంటి అద్భుతమైన ప్రతిభ ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..