
అమెరికా, భారత్ మధ్య రెండు రోజుల వాణిజ్య చర్చలు పూర్తి దిల్లీ: మధ్యంతర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చల ప్రగతిని భారత్, అమెరికా సమీక్షించాయి.
రెండు రోజుల పాటు ఇక్కడ జరిగిన సమావేశం ఇందుకు వేదికైంది. అమెరికా విధించిన తాత్కాలిక 10% టారిఫ్ గడువు ముగింపు (జులై 24)లోగా, ఒప్పందం ఖరారు చేసుకోవాలన్న లక్ష్యంతో ఇరు దేశాలున్నాయి. ఈ సమావేశంలో డిజిటల్ వాణిజ్యం, టారిఫేతర అడ్డంకులు, మార్కెట్‌కు చేరేందుకు అవకాశాలు వంటి కీలక అంశాలపై చర్చించారు. అన్ని అంశాలపై ఒప్పందం కుదిరిందా లేదా అన్నది తెలియరాలేదు. తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ)పై యూఎస్ ట్రేడ్ రెప్రెజెంటేటివ్ (యూఎస్టీఆర్) జేమిసన్ గ్రీర్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్ గోయల్ మధ్య రెండు రోజుల చర్చలు బుధవారంతో పూర్తయ్యాయి. 2026 ఫిబ్రవరి 7న వెలువడిన సంయుక్త ప్రకటనకు అనుగుణంగా మధ్యంతర ఒప్పందానికి తుదిరూపునిచ్చే దిశలో గ్రీర్ పర్యటన కీలక అడుగుగా చెప్పొచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘మంత్రులు పలు దశల్లో చర్చలు చేపట్టారు. బీటీఏలోని ప్రధాన అంశాలను విస్తృత స్థాయిలో సమీక్షించార’ని వివరించింది.
మూలధన లెక్కింపులో బ్యాంకులకు కొత్త మార్గదర్శకాలు
ముంబయి: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విదేశీ మారకపు నష్టభయానికి సంబంధించి బ్యాంకుల మూలధన లెక్కింపు విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సవరించింది. గ్రూప్/కన్సాలిడేటెడ్ స్థాయిలో, సంస్థ/స్టాండలోన్ స్థాయిలో బ్యాంకులు తమ నెట్ ఓపెన్ పొజిషన్‌ను లెక్కించాలి. విదేశీ మారకపు నష్టభయాలకు అనుగుణంగా మూలధనాన్ని నిర్వహించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రతి పనిదినం ముగింపులో విదేశీ మారకపు నష్టభయానికి సంబంధించిన మూలధన అవసరాలను కొనసాగించాల్సి ఉంటుందనీ తెలిపింది. ఈ మార్గదర్శకాలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని ఆర్బీఐ ప్రతిపాదిస్తోంది. నియంత్రణ మూలధనం నుంచి మినహాయించిన కొన్ని పెట్టుబడులకు ఫారెక్స్ రిస్క్ మూలధన నిబంధనలు వర్తించవని వివరించింది. కొన్ని నిర్మాణాత్మక విదేశీ కరెన్సీ పెట్టుబడులను నికర ఓపెన్ పొజిషన్ లెక్కింపు నుంచి మినహాయించే అవకాశమూ కల్పించింది. ఈ సవరించిన మార్పులు బాసెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్(బీసీబీఎస్) ప్రమాణాలకు అనుగుణంగా తీసుకొచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది.
దిల్లీ: ఇంధన రంగంపై ఒత్తిడి, ఆశించిన స్థాయిలో లేని రుతుపవన వర్షాలకు తోడు ప్రపంచ వృద్ధి మందగించడం వంటి కారణాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత వృద్ధి రేటు 6.6 శాతానికి పరిమితమవుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ బుధవారం అంచనా వేసింది. మన దేశ జీడీపీ 2025-26లో 7.%, 2024-25లో 7.1% వృద్ధిని నమోదు చేసిన సంగతి విదితమే. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఎస్ అండ్ పీ అంచనాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా అయిన 6.6 శాతానికి అనుగుణంగానే ఉంది. ఎల్ నినో ప్రభావం వల్ల దేశంలో రుతుపవన వర్షాలు బలహీనపడ్డాయని, దీంతో జూన్ 22 నాటికి వర్షపాత లోటు 43 శాతానికి పెరిగిందని ఎస్ అండ్ పీ తెలిపింది. భారత్ తన ముడి చమురు అవసరాలు తీర్చుకునేందుకు 88% దిగుమతులపైనే ఆధారపడుతోందని, అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల.. ఈ బిల్లుభారం పెరగడమే కాకుండా, ద్రవ్యోల్బణం కూడా 5.1 శాతానికి పెరగొచ్చని అంచనా వేసింది. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్ల పెంపు ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో ఉండొచ్చని అంచనా వేసింది.
దిల్లీ: అమెజాన్ తన అత్యంత వేగవంత డెలివరీ సేవ అయిన ‘అమెజాన్ నౌ’ను మన దేశంలోని 300కు పైగా నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది. దేశంలో అతి పెద్ద ‘నిమిషాల్లో డెలివరీ’ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ భారత పర్యటనలో ఉన్న తరుణంలో కంపెనీ తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయాలుగా ఇవి నిలుస్తాయి. ముంబయిలోని అమెజాన్నౌ మైక్రో-ఫుల్ఫిల్మెంట్ కేంద్రాన్ని బుధవారం జస్సీ సందర్శించారు.
ఈనాడు, హైదరాబాద్: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)కు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) నుంచి రూ.1,347.71 కోట్ల విలువైన కాంట్రాక్టులు లభించాయి. హెలీనా లాంచర్లు, ఎల్ఆర్యూలకు సంబంధించి రూ.1,109.37 కోట్లు, సీఎండీఎస్ ఎల్ఆర్యూలకు సరఫరా కోసం రూ.238.34 కోట్ల ఆర్డర్లు లభించాయి. వీటిని 24- 60 నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
కోల్‌కతా: బంధన్ బ్యాంక్, ఎంపిక చేసిన కాలావధి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిప్ పాయింట్ల (0.20%) వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుతో 2-3 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 7.95% వడ్డీ లభించనుంది. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు డిపాజిట్లపై 7.45%, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు డిపాజిట్లపై 7.25% వడ్డీ లభిస్తుంది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలపై రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు మొత్తం ఉంటే 6.5% వడ్డీ అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.
ట్రెంట్ ఛైర్మన్‌గా వైదొలగనున్న నోయల్ టాటా
టాటా గ్రూప్ రిటెయిల్ సంస్థ ట్రెంట్ ఛైర్మన్ పదవి నుంచి నోయల్ టాటా వైదొలగనున్నారు. ఈ ఏడాది నవంబరులో నోయల్‌కు 70 ఏళ్లు నిండుతుండటంతో, టాటా గ్రూప్ నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 23న జరిగిన ట్రెంట్ 47వ ఏజీఎంలో వాటాదార్లకు నోయల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఛైర్మన్‌గా నాకు ఇదే చివరి ఏజీఎం’ అని తెలిపారు.
ట్రూజన్ సోలార్కు రూ.2.5 కోట్ల పెట్టుబడులు
ఈనాడు, హైదరాబాద్: ట్రూజన్ సోలార్ రూ.2.5 కోట్ల పెట్టుబడులు సమీకరించింది. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు వి.చాముండేశ్వరనాథ్ ఈ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టారు. ఈ సంస్థలో ఇప్పటికే సచిన్ తెందూల్కర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి క్రీడాకారులు భాగస్వాములుగా ఉన్నారు. దేశం స్వచ్ఛ ఇంధన దిశగా సాగుతున్న క్రమంలో, తాజా పెట్టుబడి తమ విస్తరణకు ఉపయోగపడుతుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భవానీ సురేష్ చారుగుండ్ల తెలిపారు. ట్రూజన్ సోలార్ పనితీరు, పారదర్శకతతోపాటు, భవిష్యత్తు ప్రణాళికలు ఆకట్టుకున్నాయని చాముండేశ్వరనాథ్ తెలిపారు.
ఈనాడు, హైదరాబాద్: వైద్యులు, వైద్య విద్యార్థులకు అవసరమైన సమాచారాన్ని వేగంగా, కచ్చితత్వంతో అందించేందుకు కృత్రిమ మేధ ఆధారిత జెన్ఎండీని అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈఓ రితికా రెడ్డి తెలిపారు. మనదేశ వైద్య పరిస్థితులు, వ్యాధుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జెన్ఎండీని అత్యంత భద్రతా ప్రమాణాలతో రూపొందించినట్లు పేర్కొన్నారు. వైద్యులు ఒక్కో ఓపీడీ సెషన్లో 40-50 మంది రోగులను చూస్తారని, వారి పనిభారాన్ని తగ్గించేందుకు జెన్ఎండీ తోడ్పడుతుందని సహ వ్యవస్థాపకుడు, సీఎంఓ ప్రణవ్ రెడ్డి వివరించారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 60,000 మందికి పైగా దీన్ని వినియోగిస్తున్నారన్నారు.
వేదాంతా గ్రూపు స్థిరాస్తి రంగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం వేదాంతా ప్రోపర్టీ ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (వీపీపీఎల్) పేరుతో పూర్తి స్థాయి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. వేదాంతా స్థిరాస్తి వ్యాపారాలు, సంబంధిత కార్యకలాపాల కోసం వీపీపీఎల్ను ఉపయోగించుకోనుంది.
రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ ఆ లావాదేవీల పత్రాలు సమర్పించలేదు: ఈడీ
విదేశీ లావాదేవీలకు సంబంధించిన దస్త్రాలను సమర్పించడంలో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ విఫలమైనట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. ఫెమా చట్టం ఉల్లంఘన ఆరోపణలపై రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో నేరారోపణలను బలపరచే పలు పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఈడీ చర్యలపై ఇప్పటివరకు కంపెనీ స్పందించలేదు. ఈడీ సోదాల వార్తలపై స్టాక్ ఎక్స్ఛేంజీలు కూడా రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌ను వివరణ అడిగాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.