
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఈ సమావేశం జరిగింది.
పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రామ్ చరణ్ ఆయనను కలవడం ఇదే తొలిసారి.అమరావతిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) వేడుకకు హాజరయ్యేందుకు రామ్ చరణ్ మంగళగిరి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నేరుగా జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి, తన బాబాయ్ పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు రామ్ చరణ్ అభినందనలు తెలియజేశారు. అనంతరం వీరిద్దరూ కాసేపు ముచ్చటించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్‌ను రామ్ చరణ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి సంబంధించిన ఛాయాచిత్రాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.