Foreign Travel Tax: వేసవి సెలవులు వచ్చాయంటే చాలా మంది ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలు చేస్తుంటారు. ఇంకొందరు సేదతీరేందుకు బ్యాంకాక్, మాల్దీవుల, మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు వెళ్తుంటారు.
అయితే, ఇందులో కోటీశ్వరులే కాదు మధ్య తరగతి వారు సైతం ఎక్కువే ఉంటున్నారు. తమ ఆదాయం ఆదాయపు పన్ను పరిధిలో లేనివారు ఉన్నట్లయితే వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు విమాన టిక్కెట్లు, హోటల్ బుకింగ్స్, షాపింగ్ కోసం పెట్టే ఖర్చు మిమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి నెట్టేస్తుంది? ఐటీ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. మీరు సంపాదించే డబ్బుతో సంబంధం లేకుండా ఖర్చు ఆధారంగానే ఐటీ రిటర్న్స్ (ITR) ఫైల్ చేయాల్సి వస్తుంది. చాలా మంది పర్యటకులు ఈ విషయాన్ని విస్మరిస్తుంటారు. కానీ భవిష్యత్తులో ఐటీ నోటీసులు వచ్చేందుకు కారణమవుతుంది.ఆదాయం సున్నా ఐటీఆర్ ఎందుకు? సాధారణంగా ఆదాయపు పన్ను పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్నప్పుడు చాలా మంది ఐటీఆర్ ఫైల్ చేయరు. కానీ కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025లో నిబంధనలు మారాయి. బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ (BCAS) సంయుక్త కార్యదర్శి మృణాల్ మెహతా కీలక విషయాలు చెప్పారు. 'భారతీయ పన్ను చట్టాలు ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారనే దానితో పాటుగా ఎంత, ఎలా ఖర్చు పెడుతున్నారనే అంశాన్నీ పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాల ఖర్చుపై ఐటీ శాఖ గట్టి నిఘా ఉంచింది.' అని ఆయన పేర్కొన్నారు. కొత్త చట్టంలోని సెక్షన్ 263 ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రయాణాల కోసం రూ. 2 లక్షలు మించి ఖర్చు చేస్తే ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. వీరు కచ్చితంగా ఐటీఆర్ దాఖలు చేయాలి.ఈ రూ. 2 లక్షల పరిమితి ఎలా లెక్కిస్తారు? రూ. 2 లక్షల లిమిట్ కేవలం ఒక వ్యక్తి ప్రయాణ ఖర్చులు మాత్రమే కాకుండా మీ తల్లిదండ్రుల కోసం లేదా పిల్లల కోసం టిక్కెట్లు బుక్ చేసినా అది మీ అకౌంట్లోకే వస్తుంది. విమాన ఛార్జీలు, వీసా ఫీజు, హోటల్ ఛార్జీలు అన్నీ కలిపి ఈ మొత్తాన్ని లెక్కిస్తారు. ఒక జంట యూరప్ వంటి ప్రాంతానికి రెండు వారాల టూర్ వెళ్తే రూ. 2 లక్షల పరిమితి సులభంగా దాటిపోతుంది. కాబట్టి, మీ సంపాదన తక్కువగా ఉన్నా, ఈ పరిమితి దాటితే ఐటీఆర్ ఫైలింగ్ చేయాలి.లగ్జరీ షాపింగ్ చేస్తున్నారా? విదేశీ టూర్ ప్యాకేజీలు మాత్రమే కాదు అక్కడి లగ్జరీ కొనుగోళ్లపైనా ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (TCS) వర్తిస్తుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 506 ప్రకారం ఓవర్సీస్ టూర్ ప్యాకేజీలపై మొదటి రూపాయి నుంచే 2 శాతం టీసీఎస్ వర్తిస్తుంది. ఇతర విదేశీ ప్రయాణ నిధుల బదిలీలపై రూ.10 లక్షలు దాటితే 2 శాతం టీసీఎస్ పడుతుంది. 'లగ్జరీ వస్తువుల కొనుగోళ్లు సైతం ఐటీ శాఖ రికార్డుల్లో నమోదవుతాయి. విదేశాల్లో రూ.10 లక్షలు దాటి కొనే వాచ్, హ్యాండ్ బ్యాగ్ లేదా సన్‌గ్లాసెస్ లాంటి వాటిపై పాన్ కార్డ్ ఆధారంగా 1 శాతం టీసీఎస్ కట్ అవుతుంది' అని మెహతా వివరించారు.రీఫండ్ పొందడం ఎలా? చాలా మంది టీసీఎస్ (TCS) అంటే అదనపు పన్ను భారంగా భావిస్తారు. కానీ వాస్తవానికి అది ఒక ముందస్తు పన్ను (Advance Tax) వంటిదే. వార్షిక పన్ను లయబిలిటీ లేనప్పుడు, ఆ టీసీఎస్ మొత్తం తిరిగి క్లెయిమ్ చేయవచ్చు. అయితే, ఈ సొమ్మును రీఫండ్ పొందేందుకు ఐటీఆర్ ఫైల్ చేయాలి. మీ పాన్ కార్డుపై జరిగే ప్రతి లావాదేవీ ఇప్పుడు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS)లో కనిపిస్తుంది. అందుకే, రిటర్న్స్ దాఖలు చేయకుండా సైలెంట్‌గా ఉంటే ఐటీ శాఖ నోటీసు పంపుతుంది. విదేశీ ప్రయాణం ముగించుకుని వచ్చాక, మీ ఏఐఎస్ (AIS), ఫామ్ 26AS చెక్ చేసుకుని ఐటీఆర్ ఫైల్ చేయడం మంచిది.