ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా.. నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించేలా అడుగులు వేస్తున్నారు.
జనసైనికులలో నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం, అంకితభావాన్ని గుర్తించి వారికి నాయకత్వ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను నియమించారు. ఏపీలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఈ కమిటీలను నియమిస్తూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. జనసేనను సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో తన పర్యవేక్షణలో ఈ కమిటీలను నియమించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక కమిటీల ఏర్పాటులో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సీనియర్ పరిశీలకులను నియమించారు. వారికింద పార్టీ పట్ల నిబద్ధత, స్థానిక అంశాలపై అవగాహన కలిగిన ముగ్గురు సీనియర్ నాయకులను, జనసేన సభ్యత్వ నమోదులో పాల్గొన్న ముగ్గురు సాధక్స్లను నియమించారు. వారి కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం ముగ్గురు సాధక్స్ చొప్పున మొత్తం 28 మంది నేతలు, సాధక్స్ తో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. వీరికి సహకారం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరపున ఐదుగురు సహాయక సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచనున్నారు.ఈ కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలలోనూ జనసేన కోసం అంకితభావంతో పనిచేసిన నాయకులు, సాధక్స్, జనసైనికుల సమాచారాన్ని సేకరిస్తారు. 2014 నుంచి జనసేన జెండాను మోస్తున్న జనసైనికులను నేతలుగా తీర్చిదిద్దేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్లమెంట్ నుంచి గ్రామ స్థాయి వరకు, వివిధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారికి, వారి ఆసక్తికి తగిన విధంగా బాధ్యతలు అప్పగించనున్నారు. సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.