
జూలూరుపాడు, జూన్ 24 : వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులను మోసగించేలా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్ హెచ్చరించారు.
బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తనాలు, ఎరువులు విక్రయించే ప్రతి వ్యాపారి విధిగా వ్యవసాయ శాఖ జారీ చేసిన అధీకృత లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. దుకాణాల్లో ఉన్న స్టాక్ వివరాలను ప్రతిరోజూ రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన బిల్లులు, స్టాక్ రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలన్నారు. ఎంఆర్పీకి మించి అధిక ధరలకు విక్రయించరాదని, రైతులు కోరిన విత్తనాలను మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే అధీకృత దుకాణాల్లో నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు ప్రతి దానికి తప్పనిసరిగా రసీదు అడిగి తీసుకోవాలన్నారు.