
ఈ డిజిటల్ యుగంలో వైర్లెస్ ఇయర్‌బడ్స్ (Wireless Earbuds or Bluetooth) మన జీవితంలో ఒక భాగమైపోయాయి. ప్రయాణంలో, వ్యాయామం చేసేటప్పుడు, ఆఫీస్ పనిలో.. ఇలా ప్రతీచోట వీటి వాడకం కామన్ అయిపోయింది.
అయితే వీటి నుంచి వచ్చే రేడియేషన్ (Radiation) మన మెదడుపై ప్రభావం చూపుతుందా అనే ఆందోళన చాలామందిలో ఉంది. దీనిపై సైన్స్ ఏం చెబుతోందో చూద్దాం.
వైర్లెస్ ఇయర్‌బడ్స్ బ్లూటూత్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇవి పనిచేస్తున్నప్పుడు తక్కువ స్థాయిలో రేడియో ఫ్రీక్వెన్సీ (RF) తరంగాలను విడుదల చేస్తాయి. అదే వైర్డ్ (Wired) హెడ్ఫోన్లు కేబుల్ ద్వారా సిగ్నల్స్ పంపిస్తాయి కాబట్టి వాటి నుంచి ఎలాంటి రేడియేషన్ రాదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇయర్‌బడ్స్ నుంచి వచ్చే రేడియేషన్, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాల కన్నా చాలా తక్కువగా ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌ను 'ప్రమాదకారి కావొచ్చు' (Possibly Carcinogenic - Group 2B) కేటగిరీలో చేర్చాయి. అంటే ఇది హానికరం అని నిరూపించడానికి ప్రస్తుతానికి పరిమిత ఆధారాలు మాత్రమే ఉన్నాయని అర్థం. ఎక్కువ కాలం వాడితే వచ్చే ప్రభావాలపై అధ్యయనాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇయర్‌బడ్స్ నేరుగా బ్రెయిన్ క్యాన్సర్‌కు కారణమవుతాయని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు ఇప్పటివరకూ లేవు.
సాధారణ వాడకంలో వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను ప్రమాదకరమైనవిగా పరిగణించరు. వీటి నుంచి వెలువడే రేడియేషన్ మన స్మార్ట్ఫోన్ల కంటే కూడా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ భద్రత కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అవసరం ఉన్నా, లేకపోయినా చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకోవడం మంచిదికాదు.. ఇది ప్రమాదానికి దారితీయవచ్చు.
విరామం ఇవ్వండి : గంటల తరబడి ఇయర్‌బడ్స్ పెట్టుకోవద్దు. మధ్యమధ్యలో విరామం తీసుకోండి.
వైర్డ్ హెడ్ఫోన్లు వాడండి : ఇంట్లో లేదా ఆఫీసులో ఎక్కువ సేపు పాటలు వినేటప్పుడు వైర్డ్ హెడ్ఫోన్లు వాడటం మంచిది.
నిద్రపోయేటప్పుడు వాడొద్దు : ఇయర్‌బడ్స్ పెట్టుకుని నిద్రపోయే అలవాటు మానుకోండి. ఇది చెవి ఆరోగ్యానికి, రేడియేషన్ పరంగా కూడా మంచిది కాదు.
మొత్తంగా చెప్పాలంటే వైర్లెస్ ఇయర్‌బడ్స్‌పై అనవసరమైన భయం వద్దు, కానీ జాగ్రత్తగా వాడటం ఎప్పుడూ మంచిదే. అవసరం ఉంటేనే వీటిని వాడండి... బ్లూటూత్ ఇయర్ బర్డ్స్ కాకుండా వైర్డ్స్ ఇయర్ ఫోన్స్ వాడటం ఉత్తమం.