
India Probable Playing XI vs Ireland: భారత్, ఐర్లాండ్ మధ్య జరగబోయే ఉత్కంఠభరితమైన టీ20 సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. అయితే అందరి మదిలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న..
టీమిండియా ఇన్నింగ్స్‌ను ఎవరు ప్రారంభిస్తారు? సంజు శాంసన్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలలో తుది జట్టులో ఓపెనర్లుగా వచ్చే ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరో క్లారిటీ వచ్చేసింది.
భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, ఐర్లాండ్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. జూన్ 26వ తేదీన బెల్ఫాస్ట్ మైదానంలో ఇరు జట్లు మొదటి పోరులో తలపడనున్నాయి. ఆ తర్వాత జూన్ 28న రెండో మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే ఐరిష్ జట్టుపై భారత్ తరఫున ఓపెనింగ్ జోడీగా ఎవరు బరిలోకి దిగుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సస్పెన్స్‌కు తెరపడింది.
సెలెక్టర్లు ఈ సిరీస్ కోసం అభిషేక్ శర్మతో పాటు మరో ఇద్దరు ఓపెనర్లను ఎంపిక చేశారు. అందులో సీనియర్ ఆటగాడు సంజు శాంసన్‌తో పాటు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నారు. ప్రస్తుత ఫామ్, జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక సరికొత్త ప్రయోగానికి తెరలేపినట్లు తెలుస్తోంది. యువ జోడీ అయిన అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలను ఓపెనర్లుగా బరిలోకి దించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అదే జరిగితే సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ వైభవ్ సూర్యవంశీ తన సుడిగాలి బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఈ క్రమంలోనే ఐర్లాండ్‌పై అతడిని ఓపెనర్‌గా పరీక్షించాలని టీమ్ మేనేజ్మెంట్ గట్టి పట్టుదలతో ఉంది. అతనికి తోడుగా మరో ఎడమచేతి వాటం బ్యాటర్ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ, ఇప్పటికే తన పవర్ఫుల్ హిట్టింగ్తో జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు.
ఒకవేళ వైభవ్, అభిషేక్ ఓపెనర్లుగా వస్తే.. సంజు శాంసన్ మిడిలార్డర్లో ఆడక తప్పదు. నిజానికి అంతర్జాతీయ టీ20ల్లో శాంసన్‌కు మిడిలార్డర్లో తనను తాను నిరూపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు రాలేదు. ఇప్పటివరకు తన టీ20 కెరీర్లో 62 మ్యాచ్‌లు ఆడిన సంజు, 3 సెంచరీల సహాయంతో 1399 పరుగులు చేశాడు. ఐర్లాండ్‌తో జరగబోయే ఈ సిరీస్ అతనికి చాలా కీలకం కానుంది.
ఐర్లాండ్‌తో తలపడే భారత్ అంచనా జట్టు (Probable Playing XI)..
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..