
సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు గోల్డెన్ స్పూన్ తో పుడతారు. వందల కోట్ల ఆస్తికి వారసులు కాబట్టి వాళ్లు చదువుపై పెద్దగా ఆసక్తి చూపరు. ఏదో చెప్పుకోవడానికి ఓ డిగ్రీ కోసం డిస్టాన్స్ లో అడ్మిషన్ పడేస్తుంటారు.
అంతే నిత్యం విందులు, విలాసాలు, పబ్ లు, ఫారిన్ ట్రిప్పులు, బిజినెస్, ఇలా అనేక కార్యకలాపాల్లో మునిగితేలుతుంటారు. చివరికి వివాహాలు చేసుకుని విదేశాల్లో సెటిల్ కావడమో లేక రాజకీయాలు, సినిమాల్లోకి ప్రవేశించడమో చేస్తుంటాకు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే చదువులపై ఆసక్తి కనబరుస్తుంటారు. అలాంటి కొద్ది మందిలో ఒకరు దేవినా గెహ్లోత్.. ఆమె ఓ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కుమార్తె. కానీ చదువుల్లో మాత్రం దిట్ట. తాజాగా వెల్లడైన CUET UG-2026 ఫలితాల్లో ఆమె ఏకంగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. దాంతో దేవినా గెహ్లోత్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.
దిల్లీ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కైలాష్ గెహ్లోత్ కుమార్తె దేవినా అద్భుతం చేశారు. జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించి టాప్ స్కోరర్ గా నిలిచారు. ఈ సందర్భంగా దేవినా మాట్లాడుతూ.. నిరంతరం రివిజన్, పాత పేపర్ల సాధన, టైమ్ టేబుల్ ప్రకారం స్టడీతోనే తాను ఈ విజయం సాధించానని తెలిపారు. అలాగే తనకు జర్నలిజం, రాజకీయాలపై ఆసక్తి ఉందని స్పష్టం చేశారు. పరీక్షలో మంచి మార్కులు వస్తాయని అనుకున్నానని.. కానీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఊహించలేదని తెలిపారు. ఈ ప్రిపరేషన్ తనకు సహకరించిన తల్లిదండ్రులు, సోదరి, స్కూల్ టీచర్స్ కు ధన్యవాదాలు తెలిపారు.
అలాగే తాను రోజంతా కూర్చుని చదివే విధానాన్ని పాటించలేదని మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ క్రమశిక్షణతో మెలుగుతూ కంటిన్యూగా రివైజ్ చేస్తూ ఉన్నానని దేవినా గెహ్లోత్ పేర్కొన్నారు. సీబీఎస్ఈ పరీక్షలకు ప్రిపేర్ అయిన అనుభవం సీయూఈటీ పరీక్షలో టాప్ స్కోర్ రావడానికి ఉపయోగపడిందని స్పష్టం చేశారు. తాను NCERT బుక్స్ నే ఎక్కువగా చదివానని తెలిపారు. పోటీ పరీక్షల్లో ఎక్కువగా ప్రిపేర్ అవ్వడం కూడా విద్యార్థి ధీమాను తగ్గిస్తుందని అందువల్ల ప్రశాంతతతో ఉండి మీ ప్రిపరేషన్ పై నమ్మకం పెట్టుకోవాలని సూచించారు. ఇక తన కుమార్తె పడిన కష్టానికి తగిన ఫలితం దక్కిందని ఎమ్మెల్యే కైలాష్ గెహ్లోత్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇక CUET UG-2026 పరీక్షను దేశవ్యాప్తంగా 16 లక్షల మంది విద్యార్థులు రాశారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా 280 కు పైగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో వివిధ కోర్సుల్లో డిగ్రీ చేసేందుకు చేరతారు. మరోవైపు నీట్ పేపర్ లీక్, ప్రశ్నాపత్రాల్లో అవకతవకలు నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడంతో ఈ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.