
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నారు. కేవలం 50 ఓవర్ల ఫార్మాట్లోనే కొనసాగుతోంది కూడా అందుకోసమే.
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కూ ఇద్దరు ఎంపికైన సంగతి తెలిసిందే. మరోవైపు వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్‌లో వీరిద్దరికి చోటు దక్కడం కష్టమేనన్న వాదనా ఉంది. ఈ విషయంలో మేనేజ్మెంట్ కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రో-కోపై కొందరు ఎక్కువగా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని.. సెలక్టర్లు త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నాడు.
‘‘రోహిత్, విరాట్ గురించి వస్తోన్న వార్తలు బాగోలేవు. అసలు ఎక్కడ నుంచి ఇలాంటి నెగెటివ్ ప్రచారం వస్తోందో తెలియడం లేదు. కొందరు మాత్రం ఈ ఇద్దరు ప్రపంచ కప్‌లో ఆడకూడదని బలంగా కోరుకుంటున్నారు. ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారో తెలియదు. కొందరేమో వారు ఆడకపోవచ్చని అనుమానాలు వచ్చేలా మాట్లాడతారు. మరికొందరు మాత్రం విరాట్, రోహిత్ ఉంటేనే బాగుంటుందంటారు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్‌లో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉండటం ముఖ్యం’’ అని అశ్విన్ తెలిపాడు.
‘‘వన్డే ప్రపంచ కప్‌లో విరాట్, రోహిత్ ఉండాలని మీరు కోరుకుంటే.. ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. అలా చేయడం వల్ల టోర్నీ నాటికి వారు కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఒకవేళ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే.. మున్ముందు ఈ అంశం సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది’’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.