
భారత క్రికెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క పేరు మార్మోగిపోతోంది. అతడే కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుతాలు సృష్టిస్తున్న అద్భుత బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.
ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్లోని స్టోర్మాంట్ మైదానంలో జూన్ 26 నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ఈ యువ ఎడమచేతి వాటం ఓపెనర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయడానికి సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో కేవలం భారత్‌లోనే కాకుండా, ఐర్లాండ్‌తో పాటు మొత్తం యూరప్ వ్యాప్తంగా 'వైభవ్ ఫీవర్' పీక్స్‌కు చేరింది. ఈ అద్భుత క్షణాన్ని ప్రత్యక్షంగా చూడటానికి యూరప్ నలుమూలల నుండి అభిమానులు టిక్కెట్ల కోసం ఎగబడుతుండటంతో అక్కడ అపూర్వమైన క్రేజ్ నెలకొంది. స్టోర్మాంట్ స్టేడియం సామర్థ్యం కేవలం 7,000 సీట్లు మాత్రమే కావడంతో, స్థానిక నిర్వాహకులు అదనపు సీట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మాజీ అంతర్జాతీయ క్రికెటర్ ఎం.వి. నరసింహారావు స్వయంగా వెల్లడించారు. జూన్ 26న వైభవ్ మైదానంలోకి అడుగుపెడితే, అది ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్, ఏకంగా 16 ఇన్నింగ్స్‌లలో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ పరుగులను అతను కేవలం 237.30 స్ట్రైక్ రేట్‌తో, రికార్డు స్థాయిలో 72 సిక్సర్ల సాయంతో బాదడం విశేషం. కేవలం 440 బంతుల్లోనే 1000 ఐపీఎల్ పరుగుల మార్కును చేరుకుని చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 80 బంతుల్లోనే 175 పరుగులు, అలాగే లిస్ట్-ఏ క్రికెట్లో కేవలం 11 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించి తనేంటో నిరూపించుకున్నాడు. ఈ అసాధారణ ప్రదర్శనలే సెలెక్టర్లు అతడిని సీనియర్ జట్టుకు ఎంపిక చేసేలా నిర్బంధించాయి. 15 ఏళ్ల 71 రోజుల వయసులోనే భారత జట్టుకు ఎంపికైన వైభవ్, 1989లో పాకిస్తాన్‌పై 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేసిన లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టబోతున్నాడు.
భారత్, ఐర్లాండ్ రెండు దేశాలకూ ప్రాతినిధ్యం వహించి, గత మూడున్నర దశాబ్దాలుగా ఐరిష్ క్రికెట్ కోచ్‌గా సేవలందించిన 71 ఏళ్ల సీనియర్ క్రికెటర్ ఎం.వి. నరసింహారావు (బాబీ రావు) వైభవ్ ఆటతీరును ప్రశంసల్లో ముంచెత్తారు. వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ బ్యాటింగ్ శైలిని వైభవ్ గుర్తు చేస్తున్నాడని ఆయన అన్నారు. వైభవ్ హై బ్యాక్స్వింగ్, బంతిని వేగంగా అంచనా వేసే విధానం, మైదానంలో ఏ వైపైనా షాట్లు ఆడగల సామర్థ్యం అద్భుతమని కొనియాడారు. బెల్ఫాస్ట్లోని నెమ్మదైన పిచ్‌లు, ఐర్లాండ్ బౌలింగ్‌లో విపరీతమైన వేగం లేకపోవడం వైభవ్ వంటి అటాకింగ్ బ్యాటర్‌కు బాగా కలిసివస్తాయని బాబీ రావు విశ్లేషించారు. అయితే ఇంత చిన్న వయసులోనే వచ్చిన స్టార్డమ్, విపరీతమైన అంచనాలను తట్టుకుని మానసికంగా నిలదొక్కుకోవడమే ఈ యువ సూపర్ స్టార్ ముందున్న అసలైన సవాల్ అని ఆయన స్పష్టం చేశారు.
ఈ సిరీస్‌లో మరో ప్రత్యేకత ఏమిటంటే, జూన్ 28న జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు ముందు ప్రసిద్ధ 'రాయ్ టోరెన్స్ బెల్' మోగించే అరుదైన గౌరవం నరసింహారావుకు దక్కింది. తన గురువుగా ఉన్న బాబీ రావును కలవడానికి భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. గతంలో 1995 నాట్‌వెస్ట్ ట్రోఫీలో ఐర్లాండ్ తరఫున ఆడుతూ వెస్టిండీస్ దిగ్గజం కర్ట్లీ ఆంబ్రోస్ వేసిన బౌన్సర్‌ను ఫోర్ కొట్టిన జ్ఞాపకాలను, ఆ తర్వాత ఆంబ్రోస్ వచ్చి "నువ్వు ఐరిష్ వాడిలా లేవే" అని అన్న సరదా సంఘటనను బాబీ రావు గుర్తుచేసుకున్నారు. ఆ నాడు ఇంగ్లీష్ కౌంటీ ఆఫర్‌ను కాదని కోచింగ్ వైపు మళ్లిన ఆయన, ఇయాన్ మోర్గాన్, కెవిన్ ఓబ్రెయిన్, విలియం పోర్టర్‌ఫీల్డ్ వంటి ఐరిష్ స్టార్లతో పాటు హైదరాబాద్‌లో వి.వి.ఎస్. లక్ష్మణ్, మిథాలీ రాజ్ వంటి దిగ్గజాలను తీర్చిదిద్దారు. ఇప్పుడు అదే బెల్ఫాస్ట్ వేదికగా టీమిండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర లిఖించడానికి సిద్ధమయ్యాడు.
బ్యాంక్ వడ్డీపై TDS కట్ అవుతుందా? ఈ ట్రిక్ తో ఆపండి!
ఆదాయం తక్కువని ఐటీఆర్ వేయట్లేదా? ఈ పొరపాటు చేస్తే నోటీసులు గ్యారెంటీ!
.