
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు ఆందోళన కలిగిస్తున్న వేళ ఎల్ నినో’ ముప్పు మరింత తీవ్రమవుతోంది. దీని ప్రభావం వల్ల నీటి లభ్యత, వ్యవసాయ రంగాలు దెబ్బతినడమే కాకుండా అడవులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం...
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు ఆందోళన కలిగిస్తున్న వేళ ఎల్ నినో’ ముప్పు మరింత తీవ్రమవుతోంది. దీని ప్రభావం వల్ల నీటి లభ్యత, వ్యవసాయ రంగాలు దెబ్బతినడమే కాకుండా అడవులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని వరల్డ్ రీసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (WRI) హెచ్చరించింది. ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే తీవ్ర కరవు పరిస్థితులతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని పేర్కొంది.ఎల్ నినో కారణంగా వాతావరణంలో సంభవించే మార్పుల వల్ల ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో వర్షపాత విధానం పూర్తిగా మారిపోనుంది. ఇండియాలోని కొన్ని ప్రాంతాలతో పాటు కరీబియన్ దీవులు, మధ్య అమెరికా, ఉత్తర బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా దేశాలలో వర్షాలు బాగా తగ్గిపోయి కరవు పరిస్థితులు తలెత్తే ముప్పు ఉంది. దీనివల్ల జలాశయాలు ఎండిపోయి భూగర్భ జలాలు క్షీణించే ప్రమాదం కనిపిస్తోంది. దీనికి విరుద్ధంగా పెరూ, ఈక్వెడార్, తూర్పు ఆఫ్రికా, మధ్య ఆసియా ప్రాంతాల్లో సాధారణం కంటే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అకస్మాత్తుగా సంభవించే ఈ అతివృష్టి వల్ల వరదలు ముంచెత్తి గ్రామీణ, పట్టణ మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతినే వీలుంది. వాతావరణ వ్యవస్థలోని ఈ అస్థిరత ప్రజల జీవన ప్రమాణాలను సవాలు చేయనుంది.సాగుపై తీవ్ర ప్రభావం.. పెరగనున్న ఆహార కొరతదేశాల ఆర్థిక వ్యవస్థలకు మూలస్తంభమైన వ్యవసాయ రంగంపై ఎల్ నినో ప్రభావం అత్యంత దారుణంగా ఉండే అవకాశం ఉంది. వర్షాలపైనే ఆధారపడే మెజారిటీ సాగు భూముల్లో పంటల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. గత 11 ఏళ్ల కాలంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో నేలలో ఉండే తేమ శరవేగంగా ఆవిరైపోతోంది. ఇది పంటల సాధారణ ఎదుగుదలను దెబ్బతీసి తీవ్ర నష్టాన్ని మిగులుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆహార మార్కెట్లలో కొరత ఏర్పడి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే ముప్పు ఉందని వరల్డ్ రీసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్(WRI) స్పష్టం చేసింది. వ్యవసాయానికి అవసరమైన ఇంధనం, ఎరువుల ధరలు కూడా పెరుగుతుండటంతో రైతులకు పెట్టుబడి వ్యయం భారంగా మారుతోంది. గతంలో సంభవించిన ఎల్ నినో సమయంలో దక్షిణ ఆఫ్రికా దేశాల్లో భారీగా ఆహార సంక్షోభం తలెత్తి, ఇతర దేశాల నుంచి ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.అడవుల్లో కార్చిచ్చు.. గ్లోబల్ వార్మింగ్ ముప్పుఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వల్ల కరవు తీవ్రతతో పాటు అడవుల్లో కార్చిచ్చు రగులుకునే ప్రమాదం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలలోని అటవీ ప్రాంతాలు ప్రమాదంలో ఉన్నాయి. గతంలో 2015-16, 2023-24 మధ్య కాలంలో సంభవించిన ఎల్ నినో తీవ్రత వల్ల బ్రెజిల్‌ లోని అమెజాన్ వంటి దట్టమైన అడవుల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఆ కాలంలో దాదాపు 23 లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం అగ్నికి ఆహుతైంది. ఇది గత శతాబ్దపు సగటుతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రక్రియ కూడా అడవులను సులభంగా తగులబెట్టేందుకు అనుకూలమైన పొడి వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ పరిణామాలు జీవవైవిధ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం ఈసారి ముంచుకొస్తున్నది సూపర్ ఎల్ నినో’ అయితే గనుక దాని తీవ్రత ఊహించని స్థాయిలో ఉండనుంది. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ బారిన పడి అల్లాడుతున్న భూమిపై ఈ పరిణామాలు జీవన సంక్షోభానికి దారితీయవచ్చు. అందుకే తక్షణమే అంతర్జాతీయ దేశాలు సమన్వయంతో స్పందించి, నీటి నిర్వహణ బలోపేతం చేయడం, ప్రత్యామ్నాయ సాగు పద్ధతులను ప్రోత్సహించడం అత్యవసరమని నివేదిక స్పష్టం చేస్తోంది.