దేశంలోని ఓటర్ల జాబితా సవరించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వే తెలంగాణలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే సర్వే పూర్తి కాగా..
తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను సవరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రవాసీయులలో ఆందోళనకు కారణమవుతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ నుంచి చాలా మంది గల్ఫ్ దేశాల్లో బ్లూ కాలర్ ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో ఉపాధి కోసం వెళ్లిన లక్షలాది మంది తెలుగు ప్రజలకు ఈ ఓటర్ల నమోదు, జాబితా వెరిఫికేషన్ ప్రక్రియపై సరైన సమాచారం లేకపోవడంతో వారు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రవాస తెలుగు వారి రాజకీయ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చొరవ చూపాలని అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి ఏపీలో జులై 14వ తేదీ వరకు గడువు విధించగా.. తెలంగాణలో జులై 24వ తేదీ వరకు ఈ సవరణల ప్రక్రియ కొనసాగనుంది. ఈ విషయమై సాటా జనరల్ సెక్రటరీ ముజమ్మిల్ షేక్ మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు 8 నుంచి 10 లక్షల మంది ప్రజలు విదేశాల్లో నివసిస్తున్నారని అంచనా వేశారు. అసలు SIR అంటే ఏమిటి? ఎన్నారైలు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలా? వివరాలు అప్డేట్ చేయాలా? లేదా అధికారుల నుంచి వచ్చే వెరిఫికేషన్ అభ్యర్థనలకు ఎలా స్పందించాలి? అనే విషయాలపై ఎన్నారైలకు కనీస అవగాహన లేదని ముజమ్మిల్ తెలిపారు. ఈ సమాచార లోపం వల్ల చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందని.. ఇది వారి ఓటు హక్కుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారిలో, ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న వారిలో దాదాపు 70 శాతం మంది సాధారణ రోజువారీ కార్మికులేనని ముజమ్మిల్ షేక్ గుర్తుచేశారు. వీరికి టెక్నాలజీపై పట్టు, ఇంటర్నెట్ సౌకర్యాలు చాలా పరిమితంగా ఉంటాయన్నారు. పైగా వీరికి రెండేళ్లకు ఒకసారి మాత్రమే స్వదేశానికి వచ్చేందుకు సెలవులు లభిస్తాయని వివరించారు. కేవలం ఓటరు నమోదు సమస్యలను, వెరిఫికేషన్ ఐడెంటిటీని పరిష్కరించుకోవడం కోసం వారు అంతంత మాత్రమే ఉన్న జీతాలతో వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని అత్యవసరంగా స్వస్థలాలకు ప్రయాణమై రావడం ఎంతమాత్రం సరైంది కాదని అన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి సాటా సంస్థ ఆధ్వర్యంలో సౌదీ అరేబియాలోని తెలుగు సంఘాలు, సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ప్రవాసీయులలో స్వచ్ఛందంగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఓటర్ల జాబితాలో పేర్లు అలాగే కొనసాగేందుకు ఏం చేయాలనే దానిపై ఎన్నారైలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అయితే, కేవలం స్వచ్ఛంద సంస్థల ప్రచారం సరిపోదని ప్రభుత్వాలు అధికారికంగా ప్రత్యేక అధికారులను నియమించి గల్ఫ్, ఇతర విదేశీ తెలుగు కమ్యూనిటీలతో వర్చువల్ సెమినార్లు నిర్వహించాలని సాటా కోరింది. ఆన్లైన్ ద్వారానే సులభంగా ఓటరు ప్రక్రియను పూర్తి చేసేలా విధివిధానాలను సులభతరం చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది.