
ఇంటర్నెట్ డెస్క్: ఆరోసారి ప్రపంచ కప్ బరిలోకి దిగిన పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఫామ్‌లోకి వచ్చాడు. మొదటి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపించని అతడు..
రెండో మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌పై అదరగొట్టాడు. రెండు గోల్స్ సాధించి మరీ తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆరు వరల్డ్ కప్‌ల్లో గోల్స్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. పోర్చుగల్ 5-0 తేడాతో ఉజ్బెకిస్థాన్‌పై గెలిచిన అనంతరం రొనాల్డో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. అయితే, అక్కడ అతడి ఎదుట అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సి గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో కాస్త అసహనానికి గురయ్యాడు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలేం జరిగిందంటే?
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ జర్నలిస్ట్ ప్రశ్న అడుగుతూ.. ‘‘నిన్న లియోనెల్ మెస్సి రెండు గోల్స్ చేశాడు. ఎంబాపె కూడా..’’ అని అడిగేలోపే రొనాల్డో తన తలను మరోవైపు తిప్పేశాడు. మరో ప్రశ్న అడగమని వేరే రిపోర్టర్‌కు సూచించాడు. అయితే, ‘‘మీరు అడిగే ప్రశ్ననుబట్టి.. నా సమాధానం ఉంటుంది. లేకపోతే లేదు’’ అని వ్యాఖ్యానించడం వీడియోల్లో రికార్డైంది.
టోర్నీలో అర్జెంటీనాతో మ్యాచ్ ఆడాల్సినప్పుడు ఎలా భావిస్తారు? అనే ప్రశ్నకు రొనాల్డో సమాధానం ఇచ్చాడు. ‘‘ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో తెలియడం లేదు. ఇది అర్థం లేని ప్రశ్న. కానీ, ఆ జట్టుతో మ్యాచ్ అద్భుతంగా ఉంటుంది’’ అని తెలిపాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ ముగించుకొని వెళ్తుండగా, ఓ విలేకరి ‘‘మెస్సి హ్యాట్రిక్ కొట్టాడు’’ అని ప్రస్తావించగా.. ‘‘ఇతరుల గురించి నేను పెద్దగా పట్టించుకోను’’ అని సమాధానం ఇస్తూ వెళ్లిపోయాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.