మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ , బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
జాన్వీ కపూర్ హీరోయిన్గా, వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం మూడో వారంలోనూ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో చిత్రబృందం అత్యంత వైభవంగా ‘పెద్ది విజయోత్సవం’ (సక్సెస్ మీట్) నిర్వహించింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో సుకుమార్ మాట్లాడిన మాటలు మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పించాయి. ముఖ్యంగా అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న తన తదుపరి చిత్రం ‘ఆర్సీ 17’ (RC 17) గురించి సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "థాంక్యూ సో మచ్.. థాంక్యూ ఆల్! మీరంతా ‘RC 17’ సినిమా కోసమే కదా అడుగుతున్నారు? నాకు అర్థమైంది. కానీ, ఆ సినిమా వివరాలు ఇప్పుడు నేను చెప్పను (నవ్వుతూ). నాకు ముందే అన్నీ చెప్పేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఆ సస్పెన్స్ ఏంటో మీరే ఊహించుకోండి. లవ్ యు ఆల్.. అప్డేట్ చెప్పనందుకు ఐ యామ్ వెరీ సారీ!" అంటూ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని పీక్స్‌కు తీసుకెళ్లారు.* మరి సినిమా టిక్కెట్ రేట్ల సంగతేంటి?.. చరణ్ ‘పాప్‌కార్న్’ కామెంట్స్‌పై నెటిజన్ల ట్రోలింగ్ ఇదే వేదికపై క్రేజీ డైరెక్టర్ సుకుమార్‌కి చరణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. “థాంక్యూ సుకుమార్ గారు, థాంక్యూ సో మచ్” అంటూ ‘రంగస్థలం’ కాంబో మ్యాజిక్‌ను, సుకుమార్ గారితో ఉన్న అనుబంధాన్ని చరణ్ మరోసారి గుర్తుచేసుకున్నారు. ‘RC 17’ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండటంతో, ఈ వేదికపై సుకుమార్ గురించి చరణ్ ప్రత్యేకంగా ప్రస్తావించడం మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌లా నిలిచింది. తండ్రిగా గర్వపడుతున్నా: మెగాస్టార్ చిరంజీవిఈ కార్యక్రమంలో చిత్రబృందం, పంపిణీదారులు, ప్రదర్శనకారులకి జ్ఞాపికలు ప్రదానం చేశారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. "పెద్ది చూస్తూ నేను తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాను. ఆ కథా ప్రపంచంలో లీనమై పాత్రలతో పాటు బాధని అనుభవించా. ఇలాంటి అనుభూతినిచ్చే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఇంత శక్తిమంతమైన కథకు చరణ్ న్యాయం చేస్తారని నమ్మిన దర్శకుడు బుచ్చిబాబుకు కృతజ్ఞతలు" అన్నారు. అలాగే చరణ్ ఎదుగుదలపై ప్రశంసలు కురిపిస్తూ.. "అడ్డదారుల్లో ఏదీ రాదు. కష్టపడితేనే ఏదైనా సాధ్యం. మేం కష్టాన్నే నమ్ముకున్నాం. అందుకు ప్రతిఫలంగా మమ్మల్ని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారు. నటుడిగా ఎంతో పరిపక్వత, పరిపూర్ణతని ప్రదర్శిస్తున్న రామ్‌చరణ్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తండ్రిగా ఎంతో గర్వపడుతున్నా’’ అంటూ చిరంజీవి కొనియాడారు. మొత్తానికి ‘పెద్ది’ సక్సెస్ మీట్.. రాబోయే సుకుమార్-చరణ్ కాంబో ‘RC 17’ క్రేజ్‌ను మరింత నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.