
నాటు మామిడిచెట్టుకు.. బంగినపల్లి మామిడిచెట్టు ఆర్గాన్ డోనార్గా మారింది.. తోతాపురి చెట్టు కొమ్మ నరికేస్తే.. పెద్దరసాల కొమ్మ నేనున్నానంటూ అతికింది..
ఇలా 30 ఎకరాల్లోని మామిడితోటకు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మామిడి కొమ్మలు అవయవ దాతలుగా మారాయి. సాధారణంగా మామిడి తోటలను 30 ఏళ్ల తరువాత తొలగించి మళ్లీ కొత్త మొక్కలు నాటుతారు. అవి పెరిగి, దిగుబడులు వచ్చేందుకు కొన్నేళ్లు పడుతుంది. అయితే ప్రస్తుతం ఉద్యానశాఖ అధికారులు ‘గ్రాఫ్టింగ్’ విధానంలో జీవితకాలం పూర్తయిన మామిడి చెట్లను తొలగించకుండా.. వాటి జీవతకాలాన్ని మరో 15 ఏళ్లు పొడిగించడంతోపాటు లాభదాయకమైన మామిడి రకాలు కాసేలా వాటిని మారుస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలోని పొన్నం వెంకటేశ్వరరావుకు చెందిన 30 ఎకరాల మామిడి తోటలో ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
ముందుగా తోటలోని చెట్లకు ఉన్న పెద్ద కొమ్మలను(మొదలు 10 అడుగుల వరకు ఉంచి) నరికేశారు. ఆ కాండాలకు తెగుళ్లు సోకకుండా మైలతుత్తం(కాపర్ సల్ఫేట్) రాసి కవర్లతో కట్టారు. కొన్నిరోజులకు ఆ ప్రదేశంలో కొత్త చిగుర్లు వచ్చి పెన్సిల్ మందానికి పెరగగానే.. పైభాగాన్ని కత్తిరిస్తారు. తరువాత మనకు నచ్చిన కొత్త రకం మామిడి కొమ్మలతో వెడ్జ్ గ్రాఫ్టింగ్(వీ ఆకారం) పద్ధతిలో వాటికి అంటుకడుతున్నారు. ఒకే చెట్టుకు ఐదారు రకాల అంట్లనూ కడుతున్నారు. మొదలు పాత చెట్టుది కావడం వల్ల మొక్క బలంగా ఉంటుందని, కాయ నాణ్యంగానూ పెరుగుతుందని ఉద్యానశాఖాధికారి ఆకుల వేణుకుమార్ తెలిపారు. ఇలా సాగు చేయడం వల్ల మూడేళ్లకే తోట తిరిగి కాతకు వస్తుందని వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.