Largest IPOs in Indian History: స్టాక్ మార్కెట్లలో ఐపీఓలకు విపరీతమైన డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ చాలా వరకు మంచి లిస్టింగ్ గెయిన్స్ ఆఫర్ చేస్తుంటాయి.
ఈ కారణంతోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రముఖ సంస్థల నుంచి ఐపీఓలకు డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటికి సబ్స్క్రిప్షన్ భారీగా జరుగుతుంటుంది. అందుబాటులో ఉన్న షేర్ల కంటే ఎన్నో రెట్ల మేర షేర్లకు బిడ్స్ దాఖలవుతుంటాయి. దానికి తగ్గట్లుగానే మంచి ప్రీమియంతో లిస్టింగ్ అవుతుంటాయి కూడా. గతేడాది బాగానే ఐపీఓలు సందడి చేసినా ఈ ఏడాది కాస్త చప్పగా సాగుతోంది. ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధం ఐపీఓ మార్కెట్‌ను గండి కొట్టింది. ఇక అమెరికా- ఇరాన్ డీల్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్ నెలకొనగా ఐపీఓలు జోరందుకున్నాయి. పలు పెద్ద కంపెనీల ఐపీఓలు రాబోతున్నాయి.వీటిల్లో ముందుగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ విభాగం ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేయగా దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. ఇది సుమారు రూ. 13 వేల కోట్లు సమీకరించనుంది. ఇక తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (NSE) కూడా ఐపీఓకు అప్లై చేసింది. ఇది ఏకంగా రూ. 30 వేల కోట్ల వరకు నిధుల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అతిపెద్ద ఐపీఓగా ఉన్న హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ. 27,859 కోట్లు సమీకరించగా దానిని అధిగమించనుంది. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ జియో ప్లాట్‌ఫామ్స్ కూడా సెబీకి డ్రాఫ్ట్ పేపర్స్ సబ్మిట్ చేయగా ఇది ఏకంగా రూ. 37 వేల కోట్ల వరకు నిధుల్ని సమీకరించనున్నట్లు సమాచారం. దీంతో ఇది మళ్లీ NSE ని కూడా దాటనుంది. అయితే ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ఐపీఓలు ఇప్పటివరకు ఏమేం ఉన్నాయో తెలుసుకుందాం. జియో, NSE కలిపే ఇప్పుడు ఏకంగా రూ. 67 వేల కోట్ల వరకు నిధుల్ని సమీకరించబోతున్నాయి. భారతదేశంలోనే అతిపెద్ద ఐపీఓలుగా అవతరించబోతున్నాయి.హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పటివరకు భారత దేశ స్టాక్ మార్కెట్ హిస్టరీలో ఐపీఓ ద్వారా అత్యధికంగా నిధుల్ని సమీకరించింది ఇదే. ఏకంగా రూ. 27859 కోట్ల నిధులు సమకూర్చింది. 2024 అక్టోబర్ 15-17 మధ్య సబ్స్క్రిప్షన్ జరిగింది. అక్టోబర్ 22న మార్కెట్లో లిస్టింగ్ అయ్యాయి. ఇది 100 శాతం ఆఫర్ ఫర్ సేల్ విధానంలో వచ్చింది. ఐపీఓ ప్రైస్ రూ. 1865- 1960 మధ్య ఉంది. 2.37 రెట్ల సబ్స్క్రిప్షన్ జరిగింది. ఇది డిస్కౌంట్లో లిస్టయింది.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ సబ్స్క్రిప్షన్ 2022 మే 4-9 మధ్య జరిగింది. ఇది మే 17న స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అయింది. ఇది ఐపీఓ ద్వారా రూ. 20,557 కోట్లు సమీకరించింది. ఇది కూడా పూర్తి స్థాయిలో ఆఫర్ ఫర్ సేల్ విధానంలోనే జరిగింది. ఇష్యూ ప్రైస్ రూ. 902-949 మధ్య ఉంది. 2.95 రెట్ల సబ్స్క్రిప్షన్ జరగ్గా ఇది కూడా డిస్కౌంట్లోనే లిస్టయింది.పేటీఎం భారత్‌లో ఇప్పటివరకు మూడో అతిపెద్ద ఐపీఓగా పేటీఎం (వన్ 97 కమ్యూనికేషన్స్) ఉంది. ఇది రూ. 18,300 కోట్ల మేర నిధుల్ని సమీకరించింది. 2021 నవంబర్ 8- 10 మధ్య సబ్స్క్రిప్షన్ జరగ్గా నవంబర్ 18న లిస్టింగ్ అయింది. దీని ఇష్యూ ధర చాలా ఎక్కువగా రూ. 2080- రూ. 2150 మధ్య ఉంది. ఇది 1.89 రెట్ల మేర సబ్‌స్క్రైబ్ అయింది. ఇది కూడా ఇన్వెస్టర్లకు నష్టాల్నే మిగిల్చుతూ డిస్కౌంట్లో లిస్టయింది.టాటా క్యాపిటల్ ఇది భారత్‌లో నాలుగో అతిపెద్ద ఐపీఓగా నిలిచింది. ఐపీఓ ద్వారా ఇది సుమారు రూ .15,512 కోట్ల నిధుల్ని సమీకరించింది. అప్పట్లో దీనిని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో అతిపెద్ద ఐపీఓగా చెబుతుంటారు. 2025 అక్టోబర్ 6-8 మధ్య సబ్స్క్రిప్షన్ జరగ్గా అక్టోబర్ 13న లిస్టయింది. ఇక్కడ ఆఫర్ ఫర్ సేల్, ఫ్రెష్ ఈక్విటీ షేర్లను జారీ చేశారు. ఇష్యూ ప్రైస్ రూ. 310- 326 మధ్య ఉండగా సబ్స్క్రిప్షన్ 1.95 రెట్లు జరిగింది. స్వల్ప లాభాలతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.కోల్ ఇండియా ఇది ఇప్పటివరకు భారతదేశంలో ఐదో అతిపెద్ద ఐపీఓగా ఉంది. ఇది ఐపీఓ ద్వారా రూ. 15,199 కోట్ల నిధుల్ని సమీకరించింది. 2010 అక్టోబర్ 18- 21 మధ్య సబ్స్క్రిప్షన్ జరిగింది. 2010 నవంబర్ 4న స్టాక్ ఎక్స్చేంజీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ 100 శాతం ఆఫర్ ఫర్ సేల్ విధానంలోనే జరిగింది. ఇష్యూ ప్రైస్ ఒక్కో షేరుకు రూ. 225- 245 గా ఉంది. దీనికి 15.28 రెట్ల సబ్స్క్రిప్షన్ లభించింది. ఇది దాదాపు 40 శాతం ప్రీమియంతో లిస్టింగ్ అయింది.