
అణు కేంద్రాల పరిశీలనకు ఇరాన్ అంగీకరించింది: ట్రంప్ తోసిపుచ్చిన టెహ్రాన్ వాషింగ్టన్: ఇరాన్‌లోని అణు కేంద్రాల పరిశీలన విషయంలో వాషింగ్టన్, టెహ్రాన్ తాజాగా పరస్పరం భిన్న స్వరం వినిపించాయి.
నిరుడు బాంబు దాడుల్లో దెబ్బతిన్న ఆ కేంద్రాల్లో తనిఖీల కోసం అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) ఇన్స్పెక్టర్లను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అందుకు కట్టుబడి ఉండకపోతే ఆ దేశంతో మునుముందు చర్చలే ఉండవని పేర్కొన్నారు. ఆయన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఐఏఈఏ ఇన్స్పెక్టర్లను తాము అనుమతించే షెడ్యూలు ఏదీ ఖరారు కాలేదని స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయీల్ బఘాయీ మంగళవారం ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
యుద్ధం శాశ్వతంగా ముగిశాక ఇరాన్ తమను గౌరవించాలని, అప్పుడే పశ్చిమాసియాలో శాంతి కొనసాగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. శ్వేతసౌధంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. అమెరికాను ఇరాన్ గౌరవిస్తే, సమస్యలకు తావే ఉండదని వ్యాఖ్యానించారు. టెహ్రాన్ అణ్వాయుధాలను సొంతం చేసుకోవడాన్ని తాను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించనని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఆ దేశం భవిష్యత్ ఒప్పందాలకు కట్టుబడి ఉండకపోతే.. అవసరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమని హెచ్చరించారు. ఆర్థిక మాంద్యం కంటే అణ్వాయుధాలతోనే ముప్పు ఎక్కువని వ్యాఖ్యానించారు. టెహ్రాన్‌తో స్విట్జర్లాండ్‌లో జరిగిన చర్చలను అమెరికా రైతులకు దక్కిన విజయంగా ఆయన అభివర్ణించారు. తమ దేశం నుంచి మొక్కజొన్న, సోయాబీన్స్, గోధుమలను ఇరాన్ కొనుగోలు చేస్తుందని జోస్యం చెప్పారు. అందుకు అంగీకరిస్తే.. జప్తు చేసిన ఆ దేశ ఆస్తులను విడుదల చేస్తామన్నారు. ఇరాన్లో ప్రస్తుతం మానవతా సంక్షోభం నెలకొందని, దానికి సహాయం చేయడం అవసరమని వ్యాఖ్యానించారు.
హర్మూజ్ పూర్తిగా తెరిచే ఉందని ట్రంప్ తెలిపారు. ఆ జలసంధిలో ఒక్కరోజులోనే 1.9 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు రవాణా జరిగిందని, ఇది ఆల్‌టైమ్ రికార్డు అని పేర్కొన్నారు. చమురు ధరలు తగ్గుతున్నాయని, ప్రపంచం సురక్షితమైన ప్రదేశంగా మారిందని ‘ట్రూత్ సోషల్’లో పోస్టు పెట్టారు.
యుద్ధానికి ముందున్న పరిస్థితులు తిరిగిరావు: ఘాలిబఫ్
హర్మూజ్‌కు సంబంధించి ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ కీలక ప్రకటన చేశారు. ఆ జలసంధి నిర్వహణను తామే చూస్తామన్నారు. అక్కడ యుద్ధానికి ముందున్న పరిస్థితులు ఎప్పటికీ తిరిగిరావని స్పష్టం చేశారు. ‘‘మేం అమెరికన్లను ఎన్నడూ నమ్మలేదు. ఇప్పుడూ నమ్మడం లేదు. భవిష్యత్తులోనూ వారిపట్ల ఆ ధోరణితో ఉండటం సమంజసమే’’ అని ఘాలిబఫ్ పేర్కొన్నారు. జప్తు చేసిన తమ 1,200 కోట్ల డాలర్ల ఆస్తులను అమెరికా విడుదల చేసేలా స్విట్జర్లాండ్ చర్చల్లో అంగీకారం కుదిరిందని చెప్పారు.
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మంగళవారం పాకిస్థాన్‌లో పర్యటించారు. పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌లతో ఇస్లామాబాద్‌లో ఆయన విడివిడిగా భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు అమెరికాతో జరుగుతున్న చర్చల గురించి వారితో చర్చించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.