Boss Scam : ఫోన్లకు వాట్సప్ వంటి యాప్స్ ద్వారా లింకులు పంపించడం, ఫోన్లు చేసి మాయమాటలు చెప్పడం లేదా భయపెట్టడం వంటివి చేస్తూ అందినకాడికి దోచుకోవడం సైబర్ నేరగాళ్లు చేసే పని.
దీనిపై ప్రజల్లో అవగాహన వచ్చింది. దీంతో కేటుగాళ్లు పంథా మార్చుకున్నారు. కంపెనీలను లక్ష్యంగా చేసుకుని సరికొత్త స్కామ్‌కి తెరలేపారు. బాస్ పేరిట మెసేజ్‌లు పంపిస్తూ పెద్ద మొత్తంలో దోచుకుంటున్నారు. ఈ తరహా మోసాల పట్ల వ్యక్తులు, కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ (I4C) హెచ్చరించింది. ఇంతకీ ఈ బాస్ స్కామ్ ఏమిటి అనేది ఇప్పుడే మనం తెలుసుకుందాం. సైబర్ కేటుగాళ్లు ఒక కంపెనీలోని సీఈఓ లేదా ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగుల పేర్లను ఉపయోగించి ఆ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులను మోసం చేసే విధానాన్ని బాస్ స్కామ్ గా పిలుస్తున్నారు. పై అధికారుల ఆదేశాలను ఉద్యోగులు తూచా తప్పకుండా పాటిస్తారనే విషయం తెలిసిందే. దీన్నే ఆసరగా చేసుకుని కింది స్థాయి ఉద్యోగుల నుంచి డబ్బులు బదిలీ చేయించుకోవడం లేదా రహస్య సమాచారాన్ని దొంగలించడం చేస్తున్నారు. మొదట కంపెనీ సీఈఓలు లేదా ఉన్నతాధికారులకు సైబర్ నేరగాళ్లు వల వేస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ నియంత్రణ సంస్థల పేరుతో కంపెనీ సీఈఓలకు వాట్సాప్ లేదా ఇ-మెయిల్ మెసేజ్ చేస్తారు. రూల్స్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఒక జిప్ ఫైల్ సెండ్ చేస్తారు. ఆ ఫైన్ ను సీఈఓ, ఉన్నతోద్యోగులు ఓపెన్ చేయగానే మాల్ వేర్ సిస్టమ్ లోకి ఎంటర్ అవుతుంది. చాలా కేసుల్లో సీఈఓలు ఆయా సందేశాలను తమ ఫైనాన్స్ ఆఫీసర్లకు పంపించినట్లు ఐ4సీ తెలిపింది. ఆ మాల్ వేర్ ద్వారా సైబర్ నేరగాళ్లు వాట్సప్ వెబ్ సెషన్లను హ్యాక్ చేసి వారి అధికారిక కమ్యూనికేషన్లను తమ అధీనంలోకి తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఫోన్ నంబర్ నుంచి ఫైనాన్స్ టీమ్ కి సందేశాలు పంపించి, అత్యవసరంగా డబ్బు బదిలీ చేయాలని ఆదేశిస్తారు. ఎలా జాగ్రత్త పడాలి?వాట్సప్ లేదా ఇ-మెయిల్ ద్వారా డబ్బు పంపాలని లేదా ఖాతా వివరాలు మార్చాలని పై అధికారుల నుంచి ఆదేశాలు వస్తే వెంటనే వారికి నేరుగా ఫోన్ చేసి స్వయంగా కలిసి కనుక్కోవాలి. తెలియని సోర్సెస్ నుంచి వచ్చే ఫైల్స్ లేదా అటాచ్మెంట్లను డౌన్ లోడ్ చేయవద్దు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ఎప్పుడూ వాట్సాప్ ద్వారా సాఫ్ట్ వేర్ అప్డేట్లు పంపించవని గుర్తుంచుకోవాలి. వాట్సప్ లో మీ ప్రమేయం లేకుండా ఏవైనా ఇతర డివైజెస్ కనెక్ట్ అయి ఉన్నాయేమో తనిఖీ చేస్తూ ఉండాలి. కంప్యూటర్లలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ యాంటీ మాల్ వేర్ టూల్స్ ఉపయోగించాలి. అనధికారిక ఫైల్స్ ను బ్లాక్ చేసేలా విండోస్ సిస్టమ్స్ లో సెట్టింగ్స్ మార్చుకోవాలి.