AP Cabinet Decisions on Government Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులకు డబుల్ ధమాకా ప్రకటించింది. రాష్ట్రంలోని సుమారు 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు వినిపించింది.
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో.. మంత్రివర్గం పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీలు, గురుకులాలలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారి పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే 2004 ఏడాదికి ముందు.. నోటిఫికేషన్ ద్వారా నియమితులైన 11 వేల మంది ఉద్యోగులకు CPS నుంచి OPS అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం దొరకటంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ స్వాగతించింది. OM నెం.57 అమలుపై హర్షం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రంలోని 11 వేల మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు లబ్ధి కలుగుతుందని అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే వెటరన్, ఫ్యామిలీ సీపీఎస్ కంట్రిబ్యూషన్పైనా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2017 నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపించింది. ఉద్యోగుల గ్రాడ్యుటీ మేరకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది.మరోవైపు ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాలతో పాటుగా.. పెట్టుబడులు, ఐటీ, టూరిజం రంగాల ప్రతిపాదనలకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. మొత్తం 80 అంశాలకు ఆమోదం తెలిపింది. రూ.34 వేల కోట్ల పెట్టుబడులతో 35 వేల ఉద్యోగాల కల్పనకు ఆమోదం తెలిపారు. అలాగే జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణ పనులకు కూడా ఆమోదం లభించింది. కడప, అనంతపురం జిల్లాలలో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సహకాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.