
ఓ టీవీ ఛానెల్ సమ్మెట్లో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్స్ లో కాకపుట్టించాయి. పాప్ కార్న్ ధరలు తగ్గాలన్న చెర్రీ వ్యాఖ్యలను కొందరు తప్పు పట్టారు. మరికొందరు సమర్థించారు.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ 'పెద్ది' సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. జూన్ ఫస్ట్ వీక్‌లో విడుదలైన ఈ సినిమాను 'రామ్ చరణ్ వన్ మ్యాన్ షో'గా విమర్శకులు అభివర్ణించారు. 'ట్రిపుల్ ఆర్' తర్వాత వచ్చిన 'ఆచార్య, గేమ్ ఛేంజర్' చిత్రాలు నిరాశకు గురిచేయడంతో 'పెద్ది' విజయాన్ని రామ్ చరణ్ ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో గ్రాండ్ సక్సెస్ మీట్‌ను మేకర్స్ ఏర్పాటు చేశారు. చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.
ఇదిలా ఉంటే... నిన్న రామ్ చరణ్ ఓ టీవీ ఛానెల్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. రిపబ్లిక్ టీవీ ఛానెల్ నిర్వహించిన సమ్మెట్లో పాల్గొన్న రామ్ చరణ్ మాట్లాడుతూ, 'కొవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రారో అనే సందేహంతో చాలామంది నిర్మాతలు ఉన్నారని, అలాంటి సమయంలో వచ్చిన కొన్ని చిత్రాలు ఘన విజయం సాధించి వారి నమ్మకాన్ని పెంచాయ'ని తెలిపారు. ఇవాళ మధ్య, దిగువ మధ్య తరగతి వారికి సినిమా వినోదాన్ని అందిస్తోందని, అందుకే దానికి అంతటి ఆదరణ లభిస్తోందని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. అయితే పాప్ కార్న్ ధరలు ఎక్కువ ఉన్నాయని, వీటి ధర తగ్గితే బాగుంటుందని చెర్రీ అన్నారు. ఈ మాటలను కొందరు తీవ్రంగా ఖండించారు. పాప్ కార్న్ ధరలు తగ్గాలనే రామ్ చరణ్ తమ రెమ్యూనరేషన్స్ ఎందుకు తగ్గించుకోరూ? అని ప్రశ్నించారు.
రిపబ్లిక్ టీవీ సమ్మెట్ లో 'పాప్ కార్న్ ధరలు ఎక్కువ ఉన్నాయ'ని రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హీట్‌ను పెంచాయి. దీనిపై కొందరు విశ్లేషణకులు సైతం తమ అభిప్రాయాలను వెల్లడించారు. 'స్టార్ హీరోలు భారీ పారితోషికాలు తీసుకోవడం వల్లే సినిమా బడ్జెట్ పెరుగుతోందని, అందువల్లే మూవీ రిలీజ్ టైమ్‌లో టిక్కెట్ రేట్లను పెంచి సామాన్యులపై భారం వేస్తున్నార'ని పేర్కొన్నారు. మెగాభిమానులు రామ్ చరణ్ వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేశారు. 'ఇందులో రామ్ చరణ్ ను తప్పుపట్టాల్సిన పనిలేదని, సినిమా చూడటం కోసం ఫ్యామిలీతో వెళ్ళే వారికి పాప్ కార్న్ ధరలు చుక్కలను చూపిస్తున్నాయని, సగటు ప్రేక్షకుడి తరఫున రామ్ చరణ్ మాట్లాడితే ఆయన్ని తప్పుపట్టడం సరికాద'ని వీరంటున్నారు. ఏదేమైనా... సినిమా స్టార్స్ తీసుకునే పారితోషికం గురించి కొందరు విమర్శలు చేస్తుంటే... సినీతారలు థియేటర్లలో అమ్మే పాప్ కార్న్ ధరల గురించి మాట్లాడటం చర్చలకు ఆస్కారమిస్తోంది. మరి దీనికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
నెట్‌ఫ్లిక్స్ ఊపిరి పీల్చుకో.. బాహుబలి టార్చ్‌బేరర్ వస్తున్నాడు!
పండంటి బిడ్డకు జననం.. నారా రోహిత్, శిరీష దంపతులకు ప్రమోషన్!