
పుణె: మహారాష్ట్రలోని పుణెలో కాబోయే భార్యను ఫొటో తీస్తూ లోయలో పడి బిజినెస్‌మ్యాన్ కేతన్ విశాల్ అగర్వాల్ మృతిచెందిన ఘటన కీలక మలుపు తిరిగింది.
అది ప్రమాదం కాదని, ప్రణాళిక ప్రకారం చేసిన హత్య అని పోలీసులు నిర్ధరించారు. కేతన్‌ను అతడి కాబోయే భార్యే చంపేసినట్లు (Pune Businessman Death) పేర్కొన్నారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..
26 ఏళ్ల కేతన్ అగర్వాల్ (Ketan Vishal Agarwal) జూన్ 18న చారిత్రక లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తాము ట్రెక్కింగ్‌కు వచ్చామని, కేతన్ తనను ఫొటోలు తీస్తుండగా హోరుగాలికి పట్టుతప్పి లోయలో పడిపోయాడని అతడి కాబోయే భార్య సియా గోయల్ నాడు పోలీసులకు తెలిపారు. దీంతో ప్రమాద ఘటనగా భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.
అయితే, విచారణ సమయంలో సియా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత లోతుగా దర్యాప్తు చేయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ‘‘ప్రమాదం కాదని అనుమానం వచ్చిన తర్వాత ఈ కేసును పలు కోణాల్లో విచారించాం. ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత బంధాలను పరిశీలించాం. ఆ సమయంలో సియా మరో వ్యక్తితో రిలేషన్లో ఉన్నట్లు తెలిసింది. కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదని దర్యాప్తులో బయటపడింది. దీంతో ఆమె ఈ హత్యకు కుట్ర పన్నింది. ఔటింగ్ అని చెప్పి లోహగఢ్ కోట వద్దకు వెళ్లిన తర్వాత.. సియా, ఆమె ప్రియుడు కలిసి కేతన్‌ను లోయలోకి తోసేశారు’’ అని పోలీసులు వెల్లడించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్ తన కుటుంబ స్థిరాస్తి వ్యాపార కంపెనీలో డైరెక్టరుగా ఉన్నారు. అతడికి సియాతో ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబరులో జరిగే పెళ్లి వేడుక కోసం రూ.17కోట్లతో ఉదయ్‌పుర్‌లోని ప్యాలెస్‌ను బుక్ చేశారు. బంధువులను తీసుకెళ్లేందుకు రెండు హెలికాప్టర్లను కూడా ముందే మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే జూన్ 19న సియా పుట్టినరోజు కావడంతో వీరంతా లోహగఢ్ కోటకు వెళ్లారు. అక్కడే ఈ హత్య ఘటన చోటుచేసుకుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.