
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రైనీ ఐఎఎస్ అధికారులతో సమావేశం అయ్యారు. దేశ రాజధానిలోని సేవ తీర్థ్లో ఈ భేటీ ఏర్పాటైంది. 2024 బ్యాచ్కు చెందిన మొత్తం 183 మంది ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులు ఇందులో పాల్గొన్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రైనీ ఐఎఎస్ అధికారులతో సమావేశం అయ్యారు. దేశ రాజధానిలోని సేవ తీర్థ్‌లో ఈ భేటీ ఏర్పాటైంది. 2024 బ్యాచ్‌కు చెందిన మొత్తం 183 మంది ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారులు ఇందులో పాల్గొన్నారు. వారితో ప్రధాని మోదీ ముఖాముఖి సమావేశం అయ్యారు. తమ ప్రభుత్వ ఉద్దేశాలను వివరించారు. దిశానిర్దేశం చేశారు. మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.కేంద్ర ప్రభుత్వంలోని విభిన్న మంత్రిత్వ శాఖలు, విభాగాలలో వారందరూ కూడా అసిస్టెంట్ సెక్రటరీలుగా బాధ్యతలు స్వీకరించారు. సుదీర్ఘ క్షేత్రస్థాయి శిక్షణ ముగించుకుని పాలనా యంత్రాంగంలోకి అడుగుపెడుతున్న ఈ తరుణంలో వారికి శుభాకాంక్షలు తెలిపారు. యువ అధికారులు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేశంలోని కోట్ల మంది ప్రజల ప్రగతిని ప్రభావితం చేస్తుందని అన్నారు. ప్రజాసేవలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు నిజాయితీ, సున్నితత్వం, అంకితభావం వంటి విలువలు అవసరమని చెప్పారు.ప్రతి అధికారి తమ ఫైళ్ల నిర్వహణలో మానవీయ కోణాన్ని ఎప్పటికీ విస్మరించవద్దని హితవు పలికారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కదిలే ప్రతి ఒక్క ఫైల్ వెనుక సామాన్య పౌరుడి జీవితం, ఆశయాలు, ఆవేదనలు దాగి ఉంటాయని గుర్తుంచుకోవాలని సూచించారు. నాగరిక్ దేవో భవ అనే మంత్రాన్ని పాటించాలని, ప్రజల అవసరాలే కేంద్రంగా నిర్ణయాలు తీసుకోవాలని ఉద్ఘాటించారు.గత దశాబ్దకాలంలో దేశంలో ప్రభుత్వ పనితీరులో వచ్చిన సమూల మార్పులను ప్రధాని ఈ సందర్భంగా వివరించారు. పాత సాంప్రదాయ పద్ధతుల స్థానంలో ఫలితాల ఆధారిత పాలన విధానం అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వ విభాగాలు అంతర్గతంగా వేర్వేరుగా కాకుండా, ఒకే సమష్టి వ్యవస్థగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమాజంలో క్లిష్టమైన సవాళ్లను అధిగమించాలంటే వివిధ శాఖల మధ్య పరిపూర్ణ సమన్వయం ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు.సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో పౌరులకు పారదర్శకమైన సేవలను మరింత సులభంగా అందించవచ్చని ప్రధాని పేర్కొన్నారు. పాలనలో డేటా అత్యంత కీలక వనరుగా మారిందని, ఈ గణాంకాలను సంఖ్యలుగా చూడకుండా ప్రజల సవాళ్లు, ఆకాంక్షల ప్రతిబింబాలుగా పరిగణించాలని అధికారులకు తెలిపారు. తాము రూపొందించే సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు సంపూర్ణంగా అందుతున్నాయో లేదో స్వయంగా తరచూ పరిశీలించాల్సి ఉంటుందని హితబోధ చేశారు.వచ్చే రెండు మూడు దశాబ్దాలు దేశ ప్రగతి ప్రయాణంలో అత్యంత కీలకమైనవని, 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి అధికారి తమ కార్యాచరణను రూపొందించుకోవాలని ప్రధాని మోదీ కోరారు. దేశాన్ని స్వావలంబన దిశగా నడిపే ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాహకాలు, ఉత్పాదక రంగ పురోగతి, ఇంధన భద్రత, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి జాతీయ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న బ్యాచ్‌లో దాదాపు 40 శాతానికి పైగా మహిళా అధికారులు ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.