
అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ చమురు పరిశ్రమకు ఊహించని ఊరటనిస్తూ అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇరాన్‌పై విధించిన కఠినమైన ఆంక్షలను తాత్కాలికంగా సడలిస్తూ 60 రోజుల మినహాయింపు ప్రకటించింది. ఆగస్టు 21 వరకు అమల్లో ఉండే ఈ నిర్ణయం ప్రకారం ఇరాన్ నుంచి ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఉత్పత్తి, అమ్మకం, రవాణా, దిగుమతులకు అనుమతి లభించింది. టెహరాన్‌తో విస్తృత శాంతి ఒప్పందం, అంతర్జాతీయ అణు తనిఖీలను తిరిగి ప్రారంభించే లక్ష్యంతో జరుగుతున్న చర్చల్లో భాగంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని పెంచే చర్యగా భావిస్తున్నారు.భారత్‌కు ఈ పరిణామం ఎందుకు కీలకం?ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుల్లో ఒకటైన భారత్‌కు ఈ పరిణామం వ్యూహాత్మకంగా ఎంతో మేలు చేయనుంది. తన మొత్తం చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడే భారత్, అంతర్జాతీయ ధరల ఒడిదొడుకులకు తీవ్రంగా ప్రభావితమవుతుంది. ముడి చమురు ధరల్లో ఏ చిన్న పెరుగుదలైనా దేశ దిగుమతి బిల్లు, ద్రవ్యోల్బణం, ఇంధన ధరలపై పెను ప్రభావాన్ని చూపుతుంది.గత నాలుగేళ్లలో భారత్ చమురు దిగుమతుల సరళిలో భారీ మార్పులు వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రాయితీపై లభించే రష్యన్ ముడి చమురుకు అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది. ప్రస్తుతం మన దేశ మొత్తం దిగుమతుల్లో రష్యా వాటా దాదాపు 30-40 శాతంగా ఉంది. అదే సమయంలో సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలపై కూడా భారత్ అధికంగా ఆధారపడి ఉంది.