హైదరాబాద్‌లో దొంగలు హల్చల్ చేశారు. సంతోష్ నగర్ పరిధిలో దారి దోపిడి సంచలనం సృష్టిస్తోంది. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో ఉన్న ఏటీఎంలలో నగదును నింపే.. ఒక క్యాష్ మేనేజ్మెంట్ వ్యాన్ డ్రైవర్..
మిగిలిన సిబ్బందిని ఏమార్చి రూ.17 లక్షల డబ్బుతో ఉడాయించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా.. ఏటీఎంలలో నగదు తరలింపు భద్రతపై మరోసారి పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఈ చోరీకి సంబంధించి ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ దొంగలను పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రెయిన్ బజార్-సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై ఈ భారీ డబ్బుల సంఘటన చోటుచేసుకుంది. ఏటీఎంలలో నగదును నింపేందుకు వచ్చిన సిబ్బందిలో ఒకరు పక్కా ప్లాన్ ప్రకారం.. ఆ డబ్బును కొట్టేశారు. ఆ క్యాష్ వ్యాన్ డ్రైవర్.. ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం.. నగదును ఎత్తుకెళ్లిపోయాడు. ఏటీఎంలలో నింపాల్సిన రూ.17 లక్షలతో కూడిన డబ్బు పెట్టెను తీసుకుని పారిపోయాడు. వ్యాన్ ఏటీఎం వద్దకు చేరుకున్న తర్వాత.. డబ్బు నింపే సిబ్బంది ఏటీఎం లోపలికి వెళ్లారు. అదే సమయంలో అటు వైపుగా ఒక బైక్ రాగా.. ఆ వ్యాన్‌లోని డబ్బు పెట్టెను తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. సిబ్బంది వచ్చి చూసేసరికి వ్యాన్‌లో డబ్బుల బాక్స్ కనిపించలేదు. అదే సమయంలో వ్యాన్ డ్రైవర్ కూడా కనిపించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వెంటనే ఈ దోపిడీపై ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఐఎస్ సదన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన వ్యాన్ డ్రైవర్‌ను తొందరగా పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సంతోష్ నగర్ మెయిన్ రోడ్డు సహా ఆ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. ఆ బైక్ నంబర్, నిందితుడు ఏ మార్గంలో వెళ్లాడో గుర్తించే పనిలో పడ్డారు. ఇక పరారీలో ఉన్న వ్యాన్ డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు.