
ఇంటర్నెట్‌డెస్క్: రష్యా (Russia) రాజధాని మాస్కోకు ఉక్రెయిన్ మనశ్శాంతిని కరవు చేశాయి. వరుస డ్రోన్ దాడులతో నగరం తగలబడుతోందా అన్న పరిస్థితి నెలకొంది.
యుద్ధాన్ని ఏకంగా రష్యా రాజధాని గుండెల పైకి తీసుకొచ్చింది. మరోవైపు ఆక్రమిత క్రిమియాకు రష్యా ప్రధాన భూభాగం నుంచి ఎలాంటి సరకులు, ఇంధనం చేరకుండా ఉక్రెయిన్ కట్టడి చేస్తున్నాయి. దీంతో యుద్ధం సెగ రష్యాకు బలంగా తాకుతోంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు ఉత్పత్తి చేసే దేశాల జాబితా టాప్-3లో ఉండే రష్యా.. దేశీయంగా ఇంధన కొరత ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. భారత్‌కు ఎగుమతులపై కూడా స్వల్పంగా ప్రభావం పడింది.
రష్యా ప్రధాన భూభాగంలోని రోస్టవ్ ఆన్ డాన్ పట్టణాన్ని ఆక్రమిత మారియపోల్, మెలిటోపోల్ మీదుగా క్రిమియాకు వెళ్లే ప్రధాన హైవేను ఆర్-280గా పిలుస్తారు. ఈ మార్గం నుంచే సైనిక దళాలు, ఇంధనం, ఇతర సరకులు రష్యా ఆక్రమిత ప్రాంతాలకు చేరేవి. కెర్చి వంతెనపై దాడులు పెరగడంతో దానికి ప్రత్యామ్నాయంగా క్రెమ్లిన్ వ్యూహకర్తలు దీనిని ఎంచుకొన్నారు. ఉక్రెయిన్ సైన్యంలోని 412 నెమిసోవ్ (గ్రీకు భాషలో ప్రతీకారానికి దేవత పేరు) బ్రిగేడ్‌లోని అన్ మ్యాన్డ్ సిస్టమ్స్ ఫోర్స్ ఈ విషయాన్ని గ్రహించింది. అమెరికా తయారీ హార్నెట్ , స్థానికంగా తయారుచేసిన మోరిగన్ డ్రోన్లను వాడి భారీగా దాడులు చేశాయి. ఫలితంగా ఈ మార్గంలో ఆర్-280 మీద ట్రాఫిక్ 70% శాతానికి పైగా పడిపోయింది. ట్యాంకర్లు, సైనిక వాహనాలు ఈ మార్గంలో వెళ్లాలంటే భయపడిపోతున్నాయి. ముఖ్యంగా ఈ డ్రోన్లు రష్యాలోని ఓ హైవేను దాదాపు నిర్మానుష్యంగా మార్చేయడం గమనార్హం.
ఇక ఎఫ్పీ-2, బెహెమోత్ డ్రోన్లను కూడా ఉక్రెయిన్ వాడుతోంది. ఇవి 50-300 కిలోమీటర్ల మధ్యలో లక్ష్యాలను ఛేదించగలవు. వీటి రాకతో మిడ్ రేంజిలో రష్యాపై దాడులు గతేడాది 28 రెట్లు పెరిగాయని అంచనా. ఇవి కేవలం లాజిస్టిక్స్ పైనే కాకుండా రష్యా ఎయిర్ డిఫెన్స్‌లను కూడా దెబ్బతీస్తున్నాయి.
యుద్ధం మొదలైన ఫిబ్రవరి 2022 నుంచి 2026 ఏప్రిల్ చివరి వారం వరకు ఉక్రెయిన్ దళాలు ఇంధన రిఫైనరీలే లక్ష్యంగా 158 దాడులు చేశాయి. వీటిల్లో రష్యాలోని అతిపెద్ద 33 రిఫైనరీల్లో కనీసం 24పై దాడులు చేశాయి. ర్యాజన్, సరటోవ్ రిఫైనరీల ఒక్కోదానిపై ఏకంగా దాదాపు 15 సార్లకు పైగా ఉక్రెయిన్ దళాలు విరుచుకుపడ్డాయి. సిజ్రాన్పై మే చివరికి 11వ సారి దాడి జరిగింది.
ఈ ఏడాది జనవరి నుంచి మే లోపు 16 చమురు శుద్ధి కర్మాగారాలు ఉక్రెయిన్ దాడుల్లో దెబ్బతిన్నాయి. ఈ దాడుల్లో రోజుకు 7,00,000 బ్యారెళ్ల రిఫైనింగ్ సామర్థ్యం పడిపోయింది. రష్యాలో చమురు శుద్ధి సామర్థ్యం 2009 తర్వాత తొలిసారి కనిష్ఠానికి పడిపోయింది. ఇక జనవరి నుంచి 30కి పైనున్న రిఫైనరీల్లో చూస్తే ఇది రోజుకు 2.8 మిలియన్ బ్యారెళ్లకు పైగా ఉత్పత్తిలో కోత పడింది.
ఉక్రెయిన్ దాడులు, చమురు శుద్ధి సామర్థ్యంలో అడ్డంకుల కారణంగా ముడిచమురు ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. రోజుకు 4.6 లక్షల బ్యారెళ్ల ముడిచమురు తగ్గిందని పారిస్‌లోని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది.
యుద్ధాల్లో దళాలకు అవసరమైన మందుగుండు, ఇంధనం, ఆహారం, బ్యాకప్ పంపడం చాలా ముఖ్యం. వీటిని కట్ చేస్తే ఎంతటి సైన్యమైనా కొన్ని వారాల్లో చేతులెత్తేస్తుంది. తాజాగా ఉక్రెయిన్ రష్యా విషయంలో లాజిస్టిక్స్ లాక్డౌన్ ప్లాన్ అమలుచేస్తోందని నిపుణులు అంటున్నారు. నేరుగా రష్యా దళాలపై దాడులు తగ్గించి.. వారి సరఫరాలను అడ్డుకోవడంపై దృష్టిపెట్టింది. దేశీయంగా తయారుచేసిన మధ్య శ్రేణి డ్రోన్లను ఇందుకోసం రంగంలోకి దింపింది. సరిహద్దులకు దూరంగా రష్యా లోపలి ప్రాంతాల్లోని ఇంధన కాన్వాయ్‌లు, మిలిటరీ ట్రక్కులు, రైళ్లు, ఇతర వాహనాలపై దాడులు చేసింది. ముఖ్యంగా రష్యా స్వాధీనం చేసుకొన్న క్రిమియాకు సరఫరాలను తెంపేస్తోంది. ఇటువంటి 150 దాడులను అమెరికా విశ్లేషకులు రికార్డు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచే ఇంధనం తరలిస్తున్న కనీసం 20 రైళ్లను ధ్వంసం చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. యుద్ధంలో విజయాలు సాధిస్తున్నామని రష్యా ఎంత చెబుతున్నా.. ఆ విజయాలకు భరించలేనంత మూల్యం చెల్లించుకొనేలా ఉక్రెయిన్ చేస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.