
Kunal Shah | ఇంటర్నెట్ డెస్క్: భారతీయుడికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా.. మెటాకు చెందిన వాట్సప్ సీఈవోగా నియమితులయ్యారు.
2019 నుంచి మెసేజింగ్ యాప్ సీఈఓగా వ్యవహరిస్తున్న విల్ కాథ్‌కార్ట్ స్థానంలో వాట్సప్‌నకు సారథ్యం వహిస్తారని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్లో ప్రకటించారు. ప్రస్తుతం క్రెడ్ సీఈవోగా ఉన్న కునాల్ ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. దీంతోపాటు క్రెడ్లో రూ.8,550 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు మెటా ప్రకటించింది.
క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల కోసం 2018లో క్రెడ్‌ను స్థాపించారు కునాల్ షా. దేశంలో జరుగుతున్న క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్లలో 40 శాతానికి పైగా క్రెడ్ వేదికగానే జరుగుతున్నాయి. క్రెడ్‌కు సుమారు 1.7 కోట్ల మంది నెలవారీ యూజర్లుగా ఉన్నారు. గడిచిన 8 ఏళ్లలో కంపెనీని ఈ స్థాయికి తెచ్చిన కునాల్ షా.. ఇకపై వాట్సప్‌ను ముందుండి నడపించనున్నారని మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.
‘‘కునాల్ క్రెడ్‌ను భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన టెక్నాలజీ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దారు. ఇకపై ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్‌ను నడపడంలో ఆయనకున్న నిర్మాణ దృక్పథం, దృష్టికోణం ఎంతగానో ఉపయోగపడతాయి. కోట్లాది మంది వాట్సప్ యూజర్లు, లక్షలాది మంది వ్యాపారులకు అత్యుత్తమ సేవలు అందించే ప్రక్రియలో కునాల్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని జుకర్ బర్గ్ పేర్కొన్నారు.
వాట్సప్‌ను లీడ్ చేసే బాధ్యతలు దక్కిన నేపథ్యంలో కునాల్ షా ఎక్స్ వేదికగా క్రెడ్ టీమ్నుద్దేశించి పోస్ట్ పెట్టారు. మీ సామర్థ్యానికి పది రెట్లు అధిక స్థాయి పనితీరు కనబరచాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. క్రెడ్ సీఈవోగా కునాల్ షా వైదొలిగిన నేపథ్యంలో కంపెనీ స్ట్రాటజీ, ఫైనాన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న మిథున్ సంపత్ తాత్కాలిక సీఈవోగా వ్యవహరించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.