
దేశవ్యాప్తంగా ఎల్పీజీ కనెక్షన్ల సంఖ్య 33 కోట్లు దాటింది. విస్తృతమవుతున్న పట్టణీకరణ, జనాభా పెరుగుదల తదితరాలతో నానాటికీ ఎల్పీజీకి డిమాండ్ అధికమవుతోంది.
2023-24లో దేశీయంగా వంటగ్యాస్ వినియోగం రోజుకు 81వేల టన్నులుంటే, ఆపై రెండేళ్లలో అది 91వేల టన్నులకు పెరిగింది. రాబోయే పాతికేళ్లలో ఈ గిరాకీ ఇంతకు రెట్టింపవుతుందని అంటున్నారు. ఇప్పటికే మనకు కావాల్సిన ఎల్పీజీలో 60శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందుకోసం ఏటా రూ.లక్షల కోట్ల విదేశ మారకద్రవ్యం ఖర్చవుతోంది. పైగా అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు గ్యాస్ సరఫరాలు సన్నగిల్లి ద్రవ్యోల్బణం కట్టుతప్పుతోంది. మరోవైపు గడిచిన పదేళ్లలో ఎల్పీజీ ధరలు 60శాతానికి పైగా పెరిగాయి. ఇటీవలి అమెరికా-ఇరాన్ యుద్ధ సమయంలో అవి పదిశాతం మేర అధికమయ్యాయి. ఈ ధరాభారాలను భరించలేక పల్లెపట్టుల్లో ప్రజలు మళ్లీ కట్టెలపొయ్యిలవైపు మళ్లే ప్రమాదముంది. దానివల్ల జనారోగ్యానికి, పర్యావరణానికీ హాని జరుగుతుంది. కాబట్టి జనభారత ప్రయోజనాలూ ఇంధనభద్రతల దృష్ట్యా ఎల్పీజీకి ప్రత్యామ్నాయాలను విరివిగా వాడుకలోకి తేవడం అత్యావశ్యకం.
భారత్ అంటేనే వ్యవసాయం, పాడికి పేరెన్నికగన్న దేశం. ఆసేతు హిమాచలం 20 కోట్ల పశుసంపద ఉంది. వాటి వ్యర్థాలు, మిగిలిపోయిన పంట అవశేషాలతో పాటు ఇళ్లలో వృథాగా పడేసే ఆహారపదార్థాలు బయోగ్యాస్ తయారీకి విలువైన వనరులవుతాయి. పట్టణాల నుంచి ఏటా పుట్టుకొస్తున్న 6.2 కోట్ల టన్నుల చెత్తనూ ఇందుకు వాడుకోవచ్చు. ఈ క్రమంలో వెలువడే స్లర్రీ పంటలకు సహజ ఎరువుగా ఉపయోగపడుతుంది. తత్ఫలితంగా కృత్రిమ ఎరువుల దిగుమతుల భారం దిగివస్తుంది. అయితే, 2022 నాటికి ఇండియాలో 0.3శాతం కుటుంబాలే వంటకు బయోగ్యాస్‌ను వాడుతున్నాయి. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి, గృహస్థాయి నుంచి వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి చేయడం వరకు బయోగ్యాస్‌కు ఊతమిచ్చేందుకు కేంద్రం ప్రత్యేక పథకాలు తెచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సీఎన్జీ, పైప్డ్ నేచురల్ గ్యాస్‌లకు మూడు శాతంమేర కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను కలపాలని, క్రమంగా దాన్ని పెంచాలని నిశ్చయించింది. ఇవన్నీ బాగానే ఉన్నా- ప్రారంభ ఖర్చులు ఎక్కువగా ఉండటం, వ్యర్థాల సరఫరాలో సమస్యలు, స్లర్రీకి స్థిరమైన మార్కెట్ కొరవడటం, ప్రజల్లో సరైన అవగాహన లోపించడం వంటివి బయోగ్యాస్ వినియోగ వృద్ధికి అవరోధాలుగా మారుతున్నాయి!
ఎల్పీజీతో పోలిస్తే ఇండక్షన్, ఎలక్ట్రిక్ పొయ్యిలను వాడితే ఖర్చు చాలా వరకు దిగివస్తుంది. కానీ, ఇండక్షన్ స్టవ్‌లకు ప్రత్యేకించి పాత్రలు కొనాల్సి వస్తుండటం, ఒకేసారి రెండు మూడు వంటలు చేసుకునే వెసులుబాటు లేకపోవడం, తరచూ కరెంటు కోతల వల్ల వినియోగదారులు వాటిపట్ల అంతగా మొగ్గుచూపట్లేదు. ఇళ్లపైన సౌరఫలకాల ఏర్పాటుకు సాయంచేసే పీఎం సూర్యఘర్ యోజనను సద్వినియోగం చేసుకుంటూ, వంటకు సౌరవిద్యుత్‌ను వాడుకుంటే- గ్యాస్బండల కోసం ఎదురుచూపులు చూడాల్సిన అవస్థలుండవు. సొమ్ములూ ఆదా అవుతాయి. దేశవ్యాప్తంగా ఏడాదికి 300 రోజుల పాటు పుష్కలంగా సూర్యరశ్మి లభిస్తుంది. ఆ శక్తిని సమర్థంగా అందిపుచ్చుకోగలిగితే వంట ఇంధనం విషయంలో ఇండియాకు పరాధీనత కాస్తయినా తప్పుతుంది. అది సాకారం కావాలంటే- నాణ్యమైన చవకైన సోలార్ కుక్కర్లు వంటివాటిని రూపొందించి ప్రజానీకానికి అందుబాటులోకి తేవాలి. భిన్నరంగాల్లో స్వావలంబన సాధించేందుకు దోహదపడే శాస్త్ర పరిశోధనలకు ప్రభుత్వాలు దన్నుగా నిలవాలి. దేశ సౌభాగ్యాన్ని ఇనుమడింపజేసే నూతన ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయాలు నెలవులు కావాలి!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.