
గాడిన పడటానికి చాలా సమయం పట్టవచ్చు ఎగుమతులు మళ్లీ సాధారణ స్థితికి రావాలి యుద్ధం ఆగింది. ఇరాన్ ఊపిరి పీల్చుకుంది. ప్రజలు వీధుల్లో స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు.
కానీ ఇప్పుడే ఆ దేశానికి అసలు సవాళ్లున్నాయి. అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడం ఇందులో అతి పెద్ద సవాలు. అందుకోసం గతంలోలా ఎగుమతులను పెంచుకోవాల్సి ఉంది.
యుద్ధం తాత్కాలిక ముగింపు ఒప్పందంలో భాగంగా ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేతతోపాటు విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించనుంది. అయితే మరిన్ని ఆర్థిక వెసులుబాట్ల విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. చర్చల సందర్భంగా వాటిపై ఒప్పందం కుదిరినా ఎన్నో సంక్లిష్టతలు తప్పవు.
యుద్ధం ముగియగానే ఇరాన్ కరెన్సీ రియాల్ బలపడింది. యుద్ధం సందర్భంగా డాలరు 1.8 మిలియన్ రియాల్స్వద్ద ట్రేడ్‌కాగా.. ఇప్పుడది 1.57 మిలియన్ రియాల్స్వద్ద ఉంది. అయినా యుద్ధాని కంటే ముందునాటి కంటే 18శాతం అధికంగా ఉంది.
ప్రపంచ దేశాల్లో ఇరాన్‌కు 24 బిలియన్ డాలర్ల ఆస్తులున్నాయి. వాటిని అమెరికా స్తంభింపజేసింది. ఇందులో సగం రానున్న రెండు నెలల్లో విడుదల చేసే అవకాశముంది.
శుద్ధి చేసిన యురేనియం తరలింపునకు ఇరాన్ అంగీకరిస్తే ఖతార్ బ్యాంకుల్లో ఉన్న 6 బిలియన్ డాలర్లను విడుదల చేసే అవకాశముంటుంది. వాటిని మానవతా సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు ఇరాన్ వినియోగించుకునే అవకాశముంది.
ఇరాన్‌లోకి ప్రధాన చమురు కంపెనీలను అమెరికా అనుమతించినా.. అంతర్జాతీయ ఆర్థిక సేవల వ్యవస్థ సహకరించే అవకాశాలు తక్కువ. ఎందుకంటే రాజకీయ నిర్ణయాలు వెంటనే పెట్టుబడులను ప్రభావితం చేయలేవు. ప్రధాన బ్యాంకులేవీ అంత త్వరగా ఇరాన్ వ్యాపారం చేసే రిస్కును తీసుకోలేవు.
ఇప్పటికే ఇరాన్ ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్టులో ఉంది. దానిని తొలగించాలంటే అనేక వెరిఫికేషన్లు చేయాలి. దీనికి చాలా సమయం పడుతుంది.
పాశ్చాత్య దేశాల కంపెనీలు దూరమైనప్పుడల్లా రష్యావైపు ఇరాన్ చూసేది. అయితే గత రెండు దశాబ్దాల్లో ఆ దేశం పెద్దగా సాయపడలేదు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఇరాన్ ఎదగడానికి రష్యా అంతగా సహకరించే అవకాశం కనిపించడంలేదు.
యుద్ధానికంటే ముందు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును ఇరాన్ ఎగుమతి చేసేది. ఆంక్షలను ఎత్తివేస్తే రోజుకు 2.5 మిలియన్ బ్యారెళ్లను ఎగుమతి చేయవచ్చు. గత ఏడాది ఆ దేశం చమురు ఎగుమతుల ద్వారా 46.7 బిలియన్ డాలర్లను ఆర్జించింది. ఆంక్షలను ఎత్తివేస్తే అది మరింత పెరిగే అవకాశముంది. అయితే అది అంత వేగంగా సాధ్యం కాకపోవచ్చు. 38 శాతం పెట్రో ఉత్పత్తులను ఎగుమతులు చేసే పర్షియన్ గల్ఫ్‌లోని 6 పెట్రోకెమికల్ కాంప్లెక్సులు ధ్వంసం కావడంతో ప్రస్తుతం అవి 13శాతానికి పరిమితమయ్యాయి.
పెట్రో కెమికల్, స్టీల్ పరిశ్రమల ద్వారా ఇరాన్‌కు భారీగా ఆదాయం వచ్చేది. యుద్ధం కారణంగా ఆ పరిశ్రమలు ధ్వంసమయ్యాయి. దీంతో సంప్రదాయంగా తాను ఎగుమతి చేసే ఈ ఉత్పత్తులను ఇప్పుడు ఆ దేశం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
ఇరాన్ పునర్నిర్మాణానికి 300 బిలియన్ డాలర్ల పెట్టుబడుల అంశం ఎంతో కీలకం. అరబ్ దేశాలకు చెందిన కంపెనీలు.. ఎంతవరకు పెట్టుబడులు పెడతాయనేది అనుమానమే. గతంలో ఇలాంటి నిధులను ప్రభుత్వాలు అందించేవి. కానీ ఇప్పుడు ఆ భారాన్ని ప్రైవేటు సంస్థలపై పెట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.