
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Hidden Treasure Laws In India: మన సొంత భూమి లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తిపై మనకు సర్వహక్కులూ ఉంటాయని భావించడం సహజం. కానీ, భారతీయ చట్టాల ప్రకారం భూమి ఉపరితలంపై ఉండే హక్కులకు, భూగర్భంలో లభించే వనరులపై ఉండే హక్కులకు చాలా తేడా ఉంది. రజనీకాంత్ 'నరసింహ' సినిమాలో చూపించినట్లుగా సొంత భూమిలో ఖనిజాలు దొరకగానే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావడం నిజ జీవితంలో సాధ్యం కాదు. మీ భూమిలో లంకెబిందెలు, వజ్రాలు లేదా ఖనిజాలు లభిస్తే చట్టం ఏం చెబుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
భూమిలో ఖనిజాలుంటే హక్కు ఎవరిది? మీ భూమి అడుగున బొగ్గు, ముడి ఇనుము, పెట్రోలియం, బంగారం లేదా వజ్రాలు వంటి ఏ రకమైన సహజ ఖనిజ సంపద బయటపడినా.. దానిపై మీకు ఎలాంటి హక్కు ఉండదు.
చట్టం ఏం చెబుతోంది? 'మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టం, 1957' ప్రకారం భూగర్భంలో ఉండే అన్ని రకాల ఖనిజాలపై పూర్తి నియంత్రణ, హక్కులు కేవలం ప్రభుత్వం (రాష్ట్ర లేదా కేంద్ర) పరిధిలోనే ఉంటాయి. 2024 జులై నాటి చారిత్రాత్మక 'మినరల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ' కేసుతో పాటు 2025లో కూడా సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై స్పష్టతనిచ్చింది. భూమి మీదే అయినప్పటికీ, ప్రభుత్వ అనుమతి (లీజు) లేకుండా, రాయల్టీ చెల్లించకుండా అందులో మైనింగ్ చేసే హక్కు ఎవరికీ లేదు.
లంకెబిందెలు లేదా నిధులు దొరికితే? పాతకాలం నాటి బంగారు నాణాలు, వెండి ఆభరణాలు లేదా లంకెబిందెలు దొరికినప్పుడు 'ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్, 1878' అమల్లోకి వస్తుంది. చట్టప్రకారం పది రూపాయల కంటే ఎక్కువ విలువైన ఏ వస్తువు దొరికినా అది 'నిధి' కిందకే వస్తుంది. నిధి దొరికిన వెంటనే ఆ విషయాన్ని స్థానిక జిల్లా కలెక్టర్‌కు గానీ లేదా రెవెన్యూ అధికారులకు గానీ రాతపూర్వకంగా తెలియజేయాలి.
సమాచారం అందిన తర్వాత కలెక్టర్ 4 నుండి 6 నెలల గడువుతో పబ్లిక్ నోటీసు ఇస్తారు. ఆ నిధిని ఎవరు, ఎప్పుడు దాచారనే కోణంలో విచారణ జరుగుతుంది. ఒకవేళ ఆ నిధి 100 ఏళ్ల లోపుదా అని తేలి, దానికి సంబంధించిన వారసులు సరైన ఆధారాలు చూపిస్తే వారికి అప్పగిస్తారు. ఒకవేళ ఆధారాలు లేకపోతే దానిని 'యజమాని లేని నిధి'గా ప్రకటిస్తారు.
నిధి పంపిణీ ఎలా జరుగుతుంది? ఎటువంటి వివాదాలు లేని పక్షంలో, దొరికిన నిధిలో 75 శాతం దాన్ని కనుగొన్న వ్యక్తికి, 25 శాతం భూమి యజమానికి దక్కుతుంది. ఒకవేళ ఆ నిధికి చారిత్రక లేదా పురావస్తు ప్రాధాన్యత ఉంటే, ప్రభుత్వం దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది. అలాంటి సమయంలో ఆ నిధి మార్కెట్ విలువకు అదనంగా మరో 20 శాతం పరిహారాన్ని కలిపి కనుగొన్న వ్యక్తికి, భూ యజమానికి పంచుతారు.
అయితే నిధి దొరికిన విషయాన్ని దాచిపెట్టి, రహస్యంగా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే చట్టప్రకారం నిధిపై హక్కు కోల్పోవడమే కాకుండా, ఏడాది పాటు జైలు శిక్ష లేదా జరిమానా (లేదా రెండూ) విధించే అవకాశం ఉంది.
వజ్రాలు సొంతం చేసుకోవచ్చా? వర్షాకాలంలో పల్నాడు జిల్లాలోని కోళ్లూరు ప్రాంతం.. కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో, రోడ్లపై వజ్రాలు దొరుకుతుంటాయనే పుకారు ఉంది. చట్టప్రకారం ఈ వజ్రాలపై కూడా వెతికిన వారికి ఎలాంటి హక్కు ఉండదు. అది ఎవరి పొలంలో దొరికినా అది ప్రభుత్వ ఆస్తి కిందకే వస్తుంది. వాటిని వెంటనే పోలీసులకు లేదా రెవెన్యూ అధికారులకు అప్పగించాలి.
ఎవరైనా దొరికిన వజ్రాన్ని నిజాయితీగా అధికారులకు అప్పగిస్తే, ప్రభుత్వం దాన్ని అధికారికంగా వేలం వేస్తుంది. ఆ వేలం ద్వారా వచ్చే ఆదాయంలో ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కొంత శాతాన్ని (సాధారణంగా సగం వరకు) ఆ వ్యక్తికి నజరానాగా అందిస్తారు. మిగిలిన మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది.
ప్రస్తుతం క్షేత్రస్థాయిలో దళారుల ప్రమేయం వల్ల బ్లాక్ మార్కెట్ నడుస్తున్నప్పటికీ, చట్టపరంగా చూస్తే భూమిలో దొరికే ఎలాంటి ఖనిజాలు, లంకెబిందెలైనా ప్రభుత్వానికే చెందుతాయి. వాటిని అధికారులకు అప్పగించి చట్టబద్ధంగా వచ్చే వాటాను లేదా నజరానాను పొందడమే సురక్షితమైన మార్గం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.