
హిమాలయాల్లోని అన్నపూర్ణ పర్వతశ్రేణి ఎక్కాలని దశాబ్దం ముందు అనుకున్నా కానీ కుదరలేదు. హిమాలయాల్లోని అన్నపూర్ణ పర్వతశ్రేణి ఎక్కాలని దశాబ్దం ముందు అనుకున్నా కానీ కుదరలేదు.
ఒకరోజు హఠాత్తుగా ‘ఇప్పుడు కాదంటే ఎప్పుడూ కాదు మిహిర్!’ అన్నాను 22 ఏళ్ళ కొడుకుతో.
నేపాల్‌లోని పోఖర నగరం నిజమైన అర్థంలో సౌందర్యానికి, భద్రతకు, ప్రశాంతతకు ప్రతీక. ప్రతీ కట్టడం, రెస్టారెంట్ తమ ప్రత్యేకతను చాటుతుంటాయి. ప్రపంచం నలు మూలల నుంచి హిమాలయాల ప్రేమికులు ఇక్కడ స్వేచ్ఛగా, ఆనందంగా సంచరిస్తుం టారు. పోఖర నుంచి 45 కిలోమీటర్ల దూరంలోని ఝానుదండ గ్రామాన్ని మే 23న చేరుకున్నాం. అక్కడి నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నపూర్ణ బేస్‌క్యాంప్‌నకు వెళ్లిరావడానికి 8 రోజులు పడుతుందని చెప్పారు ట్రెక్కింగ్ ఆపరేటర్స్. మొత్తం 56 నుంచి 60 కిలోమీటర్లు కొండలు ఎక్కి దిగాలి. ఈ గ్రామం సముద్ర మట్టానికి 1780 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అన్నపూర్ణ బేస్ క్యాంప్ (ఏబీసీ) ఎత్తు 4130 మీటర్లు.
నడక మొదలు పెట్టగానే, హిమాలయాల్లో లేని పెద్ద పర్వతాలను అవతార్‌లో చూపించ లేదు అనిపించింది. చేతిలో రెండు కర్రలు, చలికి రక్షణగా ఒక జత బట్టలు, ట్రెక్కింగ్ బూట్లు. సన్నని దారి కిందికి అవరోహణ. ఆ తర్వాత అరగంట ఆరోహణ. ఏబీసీ నుంచి తిరిగి వస్తున్న వారిలో దాదాపు అంతా యుక్త వయస్కులే. వాళ్ళు నాతో బెస్టాఫ్ లక్ అంటుంటే చాదస్తం అనుకున్నా. అందులో సాహసం చేస్తున్నారనే ధ్వని నడిచేకొద్ది అర్థం అయ్యింది. వయసు నలభై దాటినవాళ్లు అరుదుగా కనిపించారు.
అరగంట కొండ ఎక్కగానే, ఆగి శ్వాస తీసుకుని ‘బాగా ఆలోచించే బయలుదేరాం కదా’ అనే సందేహం. మలుపు వరకు బండలు లేకపోతే, పర్లేదు ఎక్కగలం అనుకోవడం. మలుపు దాటగానే చాలా మెట్లు కనిపిేస్త, ఓహ్ అంతే కదా అనుకోవడం. గంట తర్వాత కంచర గాడిదలు సరుకులు మోసుకెళ్లడం కనిపిేస్త, వాటిమీద తిరిగి వచ్చే అవకాశం ఉండవచ్చు అనే ఊహ. ఏబీసీ వెళ్ళే హెలికాప్టర్ కనిపించినప్పుడు, రెండు లక్షల రూపాయలు... ఎన్ని నెలలు కష్టపడితే సంపాదించేది అనే సాలోచన. ఈ ఆలోచనకు విరామమే లేదు. అయితే వాటిపట్ల స్పృహే పలాయనం నుంచి రక్షించింది.
మధ్యాహ్నానికి 2170 మీటర్ల ఎత్తులో ఉన్న చోమ్రోంగ్ గ్రామంలో లంచ్ చేసి, సుదూరంగా తెల్లగా మెరుస్తున్న అన్నపూర్ణ దక్షిణ పర్వతం వైపు దృష్టి పడింది. ఎనిమిది వేల మీటర్ల ఎత్తు అంటే 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కనిపిస్తుంది. కచ్చితంగా 5 రోజులలో చేరుకోవచ్చు అనుకున్నా. మలయాళీ, బెంగాలీ, కన్నడిగ, యువతీ యువకులు, ఆరేస్టలియా, యూరోప్ నుంచి మధ్య వయస్కులైన జంటలు, అరుదుగా చైనావారు తారసపడ్డారు.
మొదటి రోజు మధ్యాహ్నం తర్వాత నడక మందగించింది. ఆ తర్వాతి మజిలీ ఇంకెంత దూరం అని కనిపించిన వారినంతా అడగడం. సినువ గ్రామం 2340 ఎత్తులో ఉంది. మూడు గంటలు పడుతుందని జవాబిచ్చాడు ఒక సాహసి. దేశ, విదేశీయులతో ఇట్టే కలిసి పోయిన మా అబ్బాయి మిహిర్ వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు.
ప్రతీ మూడు గంటల ట్రెక్కింగ్ తర్వాత నాలుగైదు లాడ్జ్‌లు, హోటళ్ళు కనిపిస్తాయి. పిజ్జాలు, రైస్, నూడుల్స్ నుంచి రమ్ వరకు అన్నీ దొరుకుతాయి. రాత్రి బస చాలా చౌక, కానీ ఆహారం ఖరీదు. ఒక కప్పు వేడి నీరు వంద నేపాలీ రూపాయలు. అక్కడ ఆహారం దొరకడమే అదృష్టం. గ్యాస్ సిలిండర్లను మోసుకెళ్లే కంచర గాడిదలు కనిపిస్తాయి. భారతీయ రూపాయి నేపాలీ కరెన్సీ కన్నా బలమైనది కాబట్టి ఆ రేట్లు మనకు చౌకనే.
సినువ మజిలీ నుంచి రెండో రోజు ఉదయం 7 గంటలకే బయలుదేరాం. ఉత్సాహంగా నడక మొదలెట్టాం. కానీ కఠిన తర పర్వతాల ముందు ఆ ఉత్సాహం తొందరగా గడ్డకట్టి పోయింది. ఆకాశానికి మెట్లు వేసినట్టు, అవి ఎక్కడ అంతమౌతాయో కనిపించకపోతే కలిగే గుబులు ఊహించండి. పూర్తిగా తలవంచి, మోకాళ్ళ మీద ఒత్తిడి పడకుండా మెల్లగా అడుగులో అడుగు వేయాలి. దారి ఎప్పుడూ అంతమవుతుందనే ఆలోచనే రాకూడదు. తల పైకెత్తి చూసిన ప్రతీసారి నా నడక మందగించి పోతోంది. కానీ ప్రతీ పది అడుగుల కొకసారి, ఎత్తైన పర్వతాల సౌందర్యం కళ్ళ నిండా చూసి, గుండె నిండా గాలి పీల్చుకుని ఎక్కడం ప్రారంభించాను. ఆలోచించడమే సమస్య. ముందుకే సాగితే గమ్యం ఎప్పుడో ఒకప్పుడు రాకపోదు. దారి పక్కన మంచుకరిగి ప్రవహించే ధార నుంచి చల్లని నీళ్ళను తాగినప్పుడు ఉన్నపళంగా శక్తి ఆవహించేది. నీటితో మొహం, చేతులు కడుక్కుంటే విశ్రాంతి అనిపించేది. అన్నపూర్ణ నుంచి వస్తున్న యువ కెరటాలు ఎదురుపడినప్పుడు కాళ్ళు శక్తిని పుంజుకునేవి. ఆ రోజు 12 గంటలలో 12 కిమీల దూరం పూర్తి చేశాం. హిమాలయ అనే చోట బసలో పడి ఒకటే నిద్ర. ఆకలి గుర్తే లేదు. హై ఆల్టిట్యూడ్ ఆకలిని చంపేసింది.
వాతావరణ పరిస్థితులు బాగోలేకపోవంతో నాలుగో రోజుకుగాని ఏబీసీ చేరలేము అంటున్నారు అన్నపూర్ణ నుంచి వస్తున్న వాళ్ళు. ముసురు పెరుగుతోంది. అదృష్టం బాగుంటే మూడోరోజు రాత్రికి చేరవచ్చు. ఇంకొక 12 కిలోమీటర్లు కావచ్చు.
చేప తోకల లాగ రెండు శిఖరాలు ఉండే మచ్చాపుచరే పర్వతం గురుంగ్ ప్రజలకు పవిత్రమైంది, శివుడి పీఠంగా భావిస్తారు. దాని ముఖద్వారానికి మూడో రోజు రెండింటికి చేరాం. దారిపొడవునా లోయలో ప్రవహించే కాళీ గండకీ నది ఉధృతి, హోరు బాగా పెరిగింది. పంటల దేవత అన్నపూర్ణ నుంచి పుట్టే నది అది. అక్కడి నుంచి అన్నపూర్ణా బేస్‌క్యాంప్ ఐదు కిలోమీటర్ల దూరంలో కనిపిస్తోంది. అక్కడి నుంచి రాళ్ళు, గుట్టలు లేకపోయినా ఊర్థ్వముఖంగా నడవాలి. కానీ అక్కడికి చేరేసరికి ఎవరికీ కాళ్ళలో సత్తువ లేదు. స్పష్టంగా తెలియని చిత్రమైన తలనొప్పి. ఎంత గాలి పీల్చినా గుండె నిండిన అనుభూతి లేదు. 4 వేల మీటర్ల ఎత్తు వరకు ఎక్కేసరికి, వాతావరణంలో వత్తిడి తగ్గిపోయి గాలిలో ఆక్సిజన్ 60 శాతానికి పడిపోతుంది. దాంతో ప్రతీ శ్వాస నుంచి శరీరానికి అందే శక్తి తగ్గిపోతూ వచ్చింది. హైదరాబాద్‌లో గంటకు 7 కిలోమీటర్లు నడిేస్త ఇక్కడ అరకిలోమీటరు కూడా నడవలేక పోయాను. పైగా సన్నగా పడుతున్న వర్షం జోరు పెరగడంతో శరీరం గడ్డకట్టుకుపోతోంది. సాయంత్రానికి మేఘాలు చెదిరిపోయి మంచు శిఖరాలు మెల్లగా దర్శనమిస్తున్నాయి.
మొత్తం 30 శిఖరాలు 55 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. అన్నపూర్ణ ఒకటి, రెండు, మూడు, దక్షిణం, మచ్చాపుచరే అని ఐదింటికి పేర్లు. మొదటి శిఖరం ఎత్తు 8091 మీటర్లు. నేపాల్‌లో మాత్రమే విస్తరించి ఉన్న పర్వతమిది. ఇది ఎవరెస్ట్ శిఖరం కన్నా 800 మీటర్లు తక్కువ. బేస్ క్యాంప్ చుట్టూ 360 డిగ్రీలలో ఈ శిఖరాలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. వాటి శిఖరాగ్రం చేరడానికి ఇంకొక 4 వేల మీటర్లు ఎక్కాలి. ప్రపంచంలో పదవ ఎత్తైన దీని శిఖరాన్ని చేరడం ప్రమాదకరం. 1950 తర్వాత ఈ బేస్ క్యాంప్ దాటి వెళ్లడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం.
ఆ రాత్రి 7 గంటలకు బేస్‌క్యాంప్ చేరుకున్నాం. నాలుగు పొరల బట్టలు వేసుకున్నా డీప్ ఫ్రీజర్‌లో ఉన్నట్టు ఉంది. నల్లాలో నీళ్లు గడ్డ కడుతున్నాయి. ప్రకృతి అవసరాలు తీర్చుకోవడం చాలా కష్టం. మంచు శిఖరాల మీద ఉదయం నాలుగున్నరకు పడే సూర్యకాంతిని చూడడానికి చలిని లెక్కచేయకుండా బయటకు వచ్చాం. పడమరలో ఉన్న నాలుగు శిఖరాలను సూర్యుని లేత కిరణాలు తాకడంతో స్వర్ణ కాంతితో వెలిగాయి. మేఘాలు లేని ఆకాశం శిఖరాలను మరింత అందంగా పొదువుకుంది.
నాల్గవ రోజు, అక్కడి నుంచి ఉదయం ఏడు గంటలకే బయటపడి తీరాలి. అదే శ్రేయస్కరం. తిరుగు ప్రయాణం మరింత కఠినం. వర్షం మా మార్గాన్ని, నడకను మరింత కష్టతరం చేసింది. అయినా ఏకబిగిన 20 కిలోమీటర్లు దిగాం. మోకాళ్లపై ఒత్తిడి పడినా రాత్రికి అప్పర్ సినువ చేరుకున్నాం. ఐదోరోజు తొందరగానే బయలు దేరినా అలసట, వర్షం నడకను మందగించేలా చేశాయి. సహనం, సంకల్పం తప్ప మరేమీ తోడు లేవు. మధ్యాహ్నం ఒంటి గంటకు జీను దండగ్రామం చేరుకున్నాం. ఏడెనిమిది రోజుల ప్రయాణాన్ని నాలుగున్నర రోజుల్లో ముగించాం.
ఈ పర్వతారోహణతో అహంకారం ప్రకృతి ముందు సాగిలపడింది. అలాగే ప్రయత్నం ఉంటే మానవ పరిమితులను ఎలా అధిగమించవచ్చో చూపింది. శారీరక, మానసిక శక్తుల మధ్య ఘర్షణ జరిగినప్పుడు రెండు దారులు కనిపిస్తాయి... అవి ముందుకు సాగడం, విడిచిపెట్టడం. ఏది ఎంచుకుంటామనేది మన సహనశీలత నిర్ధారిస్తుంది. కానీ దానిని మనం వేసే ప్రతీ అడుగు నిర్ణయిస్తుంది.
Read Latest AP News And Telangana News And International News And Telugu News