NSE IPO : జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూకు వస్తున్న సంగతి తెలిసిందే. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది.
అయితే, నియంత్రణ మార్పులు, టెక్నాలజీ వైఫల్యాలు, సైబర్ దాడులు, ఏఐ నష్టాలతో పాటు డెరివేటివ్స్ ట్రేడింగ్ ఆదాయాలపై గణనీయంగా ఆధారపడడం వంటివి తమ ఆర్థిక పనితీరు, వ్యాపార కార్యకలాపాలను ప్రభావితం చేయవచ్చని హెచ్చరించింది. ఇటీవల దాఖలు చేసిన ఐపీఓ డ్రాఫ్ట్ పేపర్లలో పలు విషయాలను ప్రస్తావించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తమ నిర్వహణ ఆదాయంలో ట్రాన్సాక్షన్ రుసుముల వాటా 78.65 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఇందులో ఆప్షన్స్ ట్రేడింగ్ నుంచే మొత్తం ఆదాయంలో 60.22 శాతం లభించినట్లు పేర్కొంది. ఈక్విటీ డెరివేటివ్స్ ఫ్రేమ్ వర్క్ బలోపేతం చేసేందుకు మార్కెట్ల రెగ్యులేటరీ సంస్థ సెబీ ఇటీవల ప్రవేశపెట్టిన నియంత్రణ చర్యలు, క్యాష్, డెరివేటివ్స్ విభాగాల్లో ట్రేడింగ్ కార్యకలాపాలు మందగించాయని, ఫలితంగా 2025-26లో ట్రేడింగ్ రాబడి తగ్గినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో పేర్కొంది. రూల్స్ మరింత కఠినతరం చేయడం, ట్రాన్సాక్షన్లు పన్నులు పెంచడం, ఇన్వెస్టర్ల ప్రాధాన్యతల్లో మార్పు, ప్రత్యామ్నాయ అసెట్ క్లాసెస్ వైపు మళ్లడం వంటివి ట్రేడింగ్ పరిణామాలు, లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. సెబీ నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు, అమలు చర్యలకు లోబడి ఉండడం వంటి విస్తృతమైన నియంత్రణపరమైన రిస్క్‌లు సైతం ఎక్స్ఛేంజ్ చూపింది. కార్యకలాపాలు, పాలన, టెక్నాలజీ, రూల్స్ పాటింపునకు సంబంధించిన అంశాలపై సెబీ నుంచి తమకు షోకాజ్ నోటీసులు, హెచ్చరిక లేఖలు, లోపాల లేఖలు, సలహా కమ్యూనికేషన్లు అందినట్లు వెల్లడించింది. ట్రేడింగ్ యాక్సెస్ పాయింట్ ఆర్కిటెక్చర్, నెట్వర్క్ కనెక్టివిటీకి సంబంధించిన విచారణల విషయంలో 2024, అక్టోబర్ నెలలో రూ.643 కోట్లకు పైగా చెల్లించడంతో పాటు ఇటీవల తాము గణనీయమైన పరిష్కార ఖర్చులను భరించినట్లు తెలిపింది. నియంత్రణ తనిఖీ ఫలితాలకు సంబంధించి ఒక పరిష్కార ఉత్తర్వు కింద 2025 జులైలో రూ.40.35 కోట్లు కూడా చెల్లించినట్లు తెలిపింది. కో-లొకేషన్, డార్క్ ఫైబర్ వ్యవహారాలకు సంబంధించిన వాటితో పాటు న్యాయపరమైన, నియంత్రణ పరమైన ప్రక్రియలు ఇంకా పరిష్కారం కాలేదని తెలిపింది. వీటి వల్ల తమ ప్రతిష్ఠ, ఆర్థిక పరంగా ప్రభావాలు పడే అవకాశం ఉందని ఎన్ఎస్ఈ పేర్కొంది. ట్రేడింగ్ పూర్తిగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతుందని, టెక్నాలజీ వైఫల్యాలు, సైబర్ సెక్యూరిటీ సంఘటనలను కీలక కార్యాచరణపరమైన నష్టాలుగా ఎక్స్ఛేంజ్ గుర్తించింది. 2021 ఫిబ్రవరిలో జరిగిన ఒక సంఘటనను ఎక్స్ఛేంజ్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ సంఘటనలో కీలకమైన నష్ట భయ నిర్వహణ, క్లియరింగ్ సెటిల్మెంట్, సర్వైలెన్స్ సిస్టమ్ లపై టెక్నాలజీ సమస్యల ప్రభావం పడడంతో అన్ని విభాగాల్లో 5 గంటలకు పైగా ట్రేడింగ్ నిలిచిపోయిన విషయాన్ని పేర్కొంది.