సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి చీఫ్‌గా ఐజీ రవి ప్రకాష్‌ను నియమించింది.
ఆయనతో పాటు పశ్చిమ గోదావరి ఎస్పీ అద్నాన్ నయీం సమీ, అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్ సుధాకర్‌లను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువరించింది. మరోవైపు, సాయికృష్ణ మిస్టరీ వ్యవహారంలో సీఐ నాగరాజుపై హత్య, నిర్బంధం సెక్షన్ల కింద కేసు నమోదుకాగా.. ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. నేడో రేపో ఆయనను అదుపులోకి తీసుకుని.. కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన నివాసం వద్ద నిఘా కోసం సిబ్బందిని మోహరించారు. రెండు రోజులుగా దర్యాప్తు బృందాలు టాస్క్‌ఫోర్స్, కృష్ణలంక సిబ్బందిని విచారిస్తున్నారు. వీరి నుంచి కీలక వివరాలు రాబడుతున్నట్లు తెలిసింది. ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని బృందం శనివారం కూడా కృష్ణలంక స్టేషన్లో సిబ్బందిని విచారించి, స్టేట్మెంట్లు నమోదు చేశారు. ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా కేంద్ర హోంశాఖ రూపొందించిన ‘ఈ-సాక్ష్య’ టూల్ ద్వారా వారి వాంగ్మూలాలను వీడియో రికార్డు చేస్తున్నారు.మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన ముగ్గురు టాస్క్‌ఫోర్స్, ఓ కృష్ణలంక కానిస్టేబుల్‌తో కూడిన బృందాన్ని మరోసారి పిలిపించి విచారించారు. టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ లతాకుమారిని కూడా రెండోరోజూ విచారించి దాదాపు 12 మంది నుంచి వివరాలు సేకరించి వాంగ్మూలాలను రికార్డు చేశారు. బస్టాండు ప్లాట్‌ఫారాలపై అనాథ శవాల గురించి ఆరా తీసి, సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు.సాయికృష్ణ మృతదేహాన్ని కృష్ణలంక స్వర్గపురిలో దహనం చేశారని అతడి తల్లి ఆరోపించడంతో అక్కడా కూడా విచారణ చేపట్టారు. పటమట సీఐ పావన్ కిశోర్ శనివారం ఉదయం స్వర్గపురికి వెళ్లి, మే 23 నుంచి 26 మధ్య దహనం చేసిన మృతదేహాల వివరాలను పరిశీలించారు. ఆపరేటర్ బాషా, కాటికాపరి శివ మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మే 23న రాత్రి 8 గంటల ప్రాంతంలో 45, 50 ఏళ్ల వయసున్న అనాథ శవాలను స్వర్గపురికి పోలీసులు తెచ్చినట్లు సిబ్బంది తెలిపారు. వీటిలో ఒకటి బస్టాండు దగ్గర, మరొకటి కాళికామాత ఆలయం ఎదుట గుర్తించారు. వాటిని స్వర్గపురిలో ఉంచేందుకు తొలుత నిరాకరించిన సిబ్బంది, డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఫ్రీజర్‌లో భద్రపరిచి మర్నాడు మధ్యాహ్నం దహనం చేసినట్లు చెప్పారు.అటు, ప్రభుత్వ ఆదేశాలతో కృష్ణ జిల్లా కమిషనరేట్ పరిధిలోని గుణదల, జగ్గయ్యపేట, మైలవరం, వన్ టౌన్, పటమట, సత్యనారాయణపురం సీఐలతో కీలక ఆధారాల కోసం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దర్యాప్తు చేస్తున్నారు.