
ఇంటర్నెట్ డెస్క్: నేడు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ యూజీ పునఃపరీక్ష (NEET-UG re-exam)కు దాదాపు 22లక్షల మంది అభ్యర్థులు హాజరవ్వనున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఆందోళన లేకుండా, ధైర్యంగా పరీక్షకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు అందరూ తప్పకుండా మంచి మార్కులు సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ), రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
మరికొన్ని గంటల్లో పిల్లలు పరీక్ష రాయబోతున్నారని.. పరీక్ష సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేసి విద్యార్థులను ఆందోళనకు గురి చేయవద్దని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు. పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే పనులు చేయవద్దన్నారు. అదే సమయంలో పెండింగ్లో ఉన్న సీబీఎస్ఈ ఫలితాలను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
పరీక్ష నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విద్యార్థులకు పలు సూచనలు చేసింది. ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని.. ప్రశాంతంగా ఎగ్జామ్ రాయాలని పేర్కొంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను వెంట తీసుకురావాలని సూచించింది. పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశం ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతుందని.. మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాలలోకి అనుమతిస్తారని తెలిపింది. ఈ సమయం దాటితే ఏ అభ్యర్థినీ లోపలికి అనుమతించబోరని పేర్కొంది.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలతో సహా పలు వివాదాలు తలెత్తిన నేపథ్యంలో.. కట్టుదిట్టమైన భద్రతల నడుమ నేడు నీట్ రీటెస్ట్ నిర్వహిస్తున్నారు. పరీక్షల సమర్థ నిర్వహణకు మొత్తం 2 లక్షల మందికి పైగా సిబ్బంది సేవలను వినియోగిస్తున్నారు. ఎలాంటి లోపాలూ తలెత్తకుండా సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచారు. పరీక్ష కేంద్రాల వద్ద రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.