
నాన్నంటే క్యాలెండర్లో ఒక రోజు కాదు. నాన్న నిన్న, నేడు, రేపు . మన ప్రతి ఊపిరి. నాన్న ఉన్నాడనే ధైర్యం. నాన్న ఉంటాడనే నమ్మకం. వాస్తవంలో భుజం తట్టినా ఊహల్లో గుండెకు హత్తుకున్నా ఆ స్పర్శ ఒక్కటే చాలు.
Jun 21 2026 6:19 AM | Updated on Jun 21 2026 6:19 AM
నాన్నంటే క్యాలెండర్లో ఒక రోజు కాదు. నాన్న నిన్న, నేడు, రేపు . మన ప్రతి ఊపిరి. నాన్న ఉన్నాడనే ధైర్యం. నాన్న ఉంటాడనే నమ్మకం. వాస్తవంలో భుజం తట్టినా ఊహల్లో గుండెకు హత్తుకున్నా ఆ స్పర్శ ఒక్కటే చాలు. ‘నాన్నా’.. ఆ పిలుపులో విశ్వమే ఒదుగుతుంది. ‘కన్నా’.. ఆ బదులులో పెన్నిధే దొరుకుతుంది. ఎన్నటికీ ముగియని పాఠం నాన్న. ఎప్పటికీ వదలని చేయి నాన్న. ‘నాన్నా’.. నిన్ను తలుస్తూనే బతుకుతాం. ‘నాన్నా’.. నిన్ను కొలుస్తూనే నడుస్తాం.
ఆ పద్యాల్లోని మాధుర్యం వినిపిస్తూనే ఉంది... మా నాన్నపేరు పిల్లా సత్యం నాయుడు. మాది ఉమ్మడి కుటుంబం. మా తల్లిదండ్రుల అమ్మానాన్నలు కూడా మాతోనే ఉండేవారు. మాకున్న కాస్త పొలంలోనే వ్యవసాయం చేసేవారు. మా నాన్నకి, బాబాయ్‌కి బాగా చదువుకోలేకపోయామని బాధ ఉండేది. అందుకే నన్ను చదువుపై దృష్టి పెట్టమని పదేపదే చెప్పేవారు. మా నాన్న పౌరాణిక ప్రేమికుడు. భారత, భాగవత,రామాయణాలలోని పద్యాలు అలవోకగా చదివి అర్థాలు చెప్పేవారు. మా ఊరిలో ఎగువ, దిగువ వీధుల్లో రెండు రామ మందిరాలు ఉండేవి. ప్రతి ఏడాది కార్తీక, మాఘ మాసాలలో పురాణ కాలక్షేపం జరిగేది. అరణ్యపర్వం, విరాటపర్వం, ఉద్యోగపర్వాలు, సుందరకాండ, యుద్ధకాండ, గజేంద్రమోక్షం, ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్ర, భగవద్గీతలలో పద్యాలను శృతిబద్ధంగా పాడుతూ అందులోని అర్థ, పరమార్థాలను విపులంగా వివరించేవారు. నాన్నతో పాటు పెద్దనాన్న కూడా పద్యాలు పాడేవారు. కరువు సంభవించినప్పుడు ఊరిలోని వెంకయ్య కోనేరు గట్టున, మర్రిచెట్టు కింద పది రోజులు పాటు విరాటపర్వం చెప్పేవారు. సరిగ్గా ఉత్తర గోగ్రహణం చెప్పే సమయానికి చినుకులు మొదలయ్యేవి. నాన్న ప్రోద్బలంతో చదివిన నేను ఉపాధ్యాయుడినయ్యాను. కాని చిన్నప్పటి నుంచి భాగవతం, పురాణాలు విని, వారి వెంట వెళ్లి నాకు కూడా పద్యాలు పాడడం అలవాటైపోయింది. నాన్న పురాణం చెప్పడానికి ఎక్కడికి వెళ్లినా వ్యాసపీఠం నేనే మోసుకెళ్లేవాడిని. ఇప్పడు భౌతికంగా ఆయన లేకపోయినా కోడికూత కంటే ముందే వినిపించే ఆయన తీయని గొంతు, ఆ పద్యాల్లోని మాధుర్యం ఇప్పటికీ నా చెవులలో వినిపిస్తూనే ఉన్నాయి.
నాన్న నమ్మకమే నన్ను నడిపిస్తోంది! పుట్టుకతోనే నాకు పోలియో. దాని కారణంగా నడిచేందుకు చాలా ఇబ్బంది పడేవాడిని.. నడిపిస్తే గాని నడవలేని స్థితి నాది. అప్పట్లో వైద్యసదుపాయాలు అంతంత మాత్రమే. డాక్టర్లు కూడా ఏం చేయలేని పరిస్థితి. అందరిలా నేను నడవడం కష్టమని అమ్మ విజయలక్ష్మి బెంగపెట్టుకుంది. కాని నేనూ నడవగలనని నమ్మింది ఒక్క మా నాన్న వెనిశెట్టి జగదీశ్వరయ్య మాత్రమే. ఇంటినుంచి స్కూలు వరకు నన్ను పట్టుకుని నడిపించేవాడు. నొప్పిగా ఉంది నాన్నా అంటే భుజానికెత్తుకుని స్కూలు దాకా మోసుకెళ్లి మళ్లీ సాయంత్రానికి బడిగంట మోగకముందే సిద్ధంగా ఉండేవాడు. కొద్ది రోజులకి కాస్త నడక అలవాటయింది. అలా ఎలాగో తంటాలు పడుతూ నా ఉన్నత విద్య పూర్తయిన తర్వాత 1999లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాను. 2002 లో శస్త్ర చికిత్స తర్వాత ఇప్పుడు అందరిలా నడవగలుగుతున్నాను. ఊహ తెలియని వయసులో నేను నడవగలుగుతానో లేదో తెలియదు కాని మా నాన్న నమ్మాడు. నేను పెద్దవాడినయ్యాక అదే నా మనసులో నాటుకుపోయింది. ఎంతమంది పోలియో బాధితులకి ఇలాంటి తండ్రి ఉంటాడనిపించింది. అందుకే నాలా పోలియోతో బాధపడుతున్నవారికి సాయపడాలనుకున్నాను. ఎంతో మంది పోలియో బాధితులకు ఫిజియోథెరపీ చేయించాను. కరోనా సమయం లో వైకల్యంతో బాధపడేవారికి ఇంటి సరుకులు పంపిణీ చేశాను. ఇప్పటికీ నా వల్లనైనంత సాయం చేస్తున్నాను. నేను చేస్తున్న కార్యక్రమాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతులమీదుగా 2009లో రోల్ మోడల్ పురస్కారాన్ని అందజేసింది. ఇదంతా నడకరాని వయసులో నన్ను వెన్ను తట్టి నడిపిన నా తండ్రి ప్రోద్బలం వల్లే సాధ్యమైంది.
సదువు సంకనేసుకొని లోకాలు సూపిన మా అయ్య సిన్నప్పుడు ఎడతెగని జబ్బుబడ్తే, యీపున గట్టుకొని ఏడిండ్ల పిల్లికూనోలే దావుకాండ్లన్ని తిరిగి పానం నిలబెట్టిన మా అయ్య ఆకరి సూపుకు అందక పోతిననే దుక్కం. నన్ను చదువుల సంక నేసుకుని లోకాలు సూపిన అయ్య బొందమీద పిడికెడు మట్టెయ్యక పోతిననే శోకం. నాక్కొలువచ్చిన సంబురం సల్లారక ముందే జరిగిపోయిన మా అయ్య రుడం, నువ్వు గింజల నూరోవంతైన తీర్సుకోకముందే నన్ను ఏకాకిని జేసి, గీ లోకం నుంచెల్లిపోయిన దుక్కం. బతుకు బాటల్ల ఎన్ని దుక్కాలు దున్ని పోసుకున్నా, గవన్ని శాన సిన్నయే. కానీ, మా అయ్య బోయిన దుక్కం ఏడేడు సముద్రాలుబడ యేడ్సినా వొడ్సిపోని వొలపోత. మా ఇంట్ల మొట్టమొదాలు నేనెరిగిన సావు దుక్కం మా అయ్యది. అయ్య నాకు వెయ్యేనుగుల బలం, యెన్నంటి వచ్చే యెన్నెల సుక్క. అయ్య యెనుక నన్ను యెన్ని అమాసలు కమ్మినా, కుమ్మినా, అయ్య ముందట నేను పున్నమి పువ్వునే. గప్పుడు (1990) టెలిగ్రాములు, టెలిఫోన్లు వున్నా, అందరికి లేకుండే. ఎవలికో వొక్కలిద్దరికుండేది. యిటు వరంగల్లు, కాజీపేట, సుట్టుముట్టున్న పల్లెలకు తోలిచ్చి, ట్రంకాల్ కొట్టిచ్చిండ్రట. గానీ నా కాడికచ్చేటాలకు ట్రంకాల్ లేదు. తోలిన మనిషి రాలే. ఇయ్యాల పొద్దుగూకి పోతే తెల్లారి మద్దేనం దాటినంక దహనం జేసిండ్రు. కాకి బల్గం, కన్నబల్గమంతా సేరుకున్నరు. దహనమైన తెల్లారి తోలిన మా అక్క కొడుకు ఆఫీసుకొచ్చి ‘తాత బాగలేడు ఈరవ్వ రమ్మన్నది’ అని ఆవగింజంత అనుమానమ్ రాకుంట చెప్పిండు. ఊరికి సేరి, బసు దిగిన్నో లేదో, బల్గమంత ఎదురచ్చేటాలకు, గప్పుడర్తమైంది. వచ్చేటప్పుడు రోడ్డు దాపునున్న మా సెల్కల మన్ను కుప్పను అలుముకొని పండుకున్న పాడె బొంగులు, పూలదండలు, సాప, సూసేటాలకు దుక్కం కట్టలు తెగింది. ఎవ్వలెంత ఏడ్సినా, ఆర్సినా, ఎంత కొట్టుకున్నా, మొత్తుకున్నా కన్ను బొడ్సుకున్నా గీ దునియల మా అయ్య అనే మనిషి కండ్లబడడు అనుకుంటేనే యెద సిల్లులు బడే ఎక్కెక్కిపడే దుక్కమ్. నేను రాకుంటా, అయ్యను ఆకరి సూపన్న సూడకుంటా ఎట్ల మన్ను జేసిండ్రు? ఎంతమంది ఆగబట్టినా ఆగకుంట నేనయ్యను సూడాలె సూపియ్యుండ్రి, బొందతోడి సూపుండ్రి...’ అని బొందను తోడ బొయిన. మంకు పట్టుగ బొబ్బ బెట్టిన. కన్నతండ్రి ఆకరి సూపుకు బాకిలేని, పిడికెడు మన్నెయ్యని మనాదులు యిప్పడికి నాకు గాయి గాయి, గత్తర గత్తర.
వ్యక్తిత్వంలో పెదరామయ్య చదువు పెద్దగా లేని మా నాన్న చదువుకుంటే జీవితం బాగుంటుందని నమ్మి నన్ను చదివించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అప్పట్లో చదువు కోసం వేరే పట్టణానికి వెళ్లిన వారికి నెల నెలా వసతి, భోజన ఖర్చులకు, కాలేజీ ఫీజులకీ మనియార్డరు పంపేకాలం. నాకు నెలకు పంపే వంద రూపాయల కోసం, తన దగ్గర లేకపోతే, కార్డు వచ్చిన వెంటనే పంపలేకపోతే కొడుకు ఎక్కడ ఇబ్బంది పడతాడో అని నోటు రాసి ఒక 500 తెచ్చుకుని ఇంట్లో సిద్ధంగా ఉంచుకునే నాన్న... సెలవులకెళ్లినప్పుడల్లా చదువుకుంటున్న వ్యక్తిగా నన్ను అబ్బురంగా చూసుకున్న నాన్న... హైదరాబాద్‌లో ఉద్యోగం లో ఉండగా నేను ఉన్న ఇంటిని పక్కింటి వాళ్లు మేనిపులేట్ చేసి ఎవిక్షన్ నోటీస్‌తో బలవంతాన ఖాళీ చేయించబోతే పల్లెటూరి వ్యక్తిగా అభిజాత్యం దెబ్బ తిన్నట్లు భావించి, అవమానభారంతో ఒక్కో సామాను బయటకు తీస్తూ కన్నీళ్లు పెట్టుకొని, నేను సంబంధిత అధికారులతో మాట్లాడి ఎవిక్షన్ ఆపించి, అందుకోసం వచ్చిన వ్యక్తులతో బయట పెట్టిన సామాన్లు లోపల పెట్టించిన తర్వాత వరండాలో కుర్చీ వేసుకుని ఒక చక్రవర్తిలా ఫీలైపోతూ ‘ఏరా మా అబ్బాయి అంటే ఏమనుకున్నారు’ అని గొప్పగా చెప్పుకుంటూ కుట్ర కారకులైన వారిని ఉద్దేశించి వారిని హేళన చేసి, కొడుకును చూసి గర్వపడ్డ నాన్న. మా అబ్బాయి అమెరికా వెళ్లినప్పుడు మా కుటుంబాల్లో ఇలా విదేశం వెళ్లిన తొలి వ్యక్తి కావటంతో ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ ‘బాబూ... చాలురా ఇది చాలు’ అంటూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరై ఎవరెస్ట్ ఎక్కినంత అనుభూతి పొందిన అల్ప సంతోషి నాన్న. నా సంపాదన గురించి ఎప్పుడూ నాతో ప్రస్తావించకుండా నా స్నేహితులు తనని కలిసిన సందర్భాల్లో ‘ఏరా... మా అబ్బాయి పర్వాలేదా... హ్యాపీగా గడుపుతున్నాడా’ (ఆయనకి వచ్చిన అతి తక్కువ ఇంగ్లిషు పదాల్లో అదొకటి) అని అడిగి సంపాదన గురించి కాకుండా నేను ఆనందంగా ఉంటున్నానా అని ఆలోచించిన నాన్న. నన్ను పరిపూర్ణంగా నమ్మి, కొడుకు సరిగా చూసుకోకపోతే ఏమైపోతామో (మా అమ్మను కలుపుకుని) అని సందేహించక నా చదువు కోసం చివరి అరఎకరం అమ్మిన నాన్న... పేరుకు చినరామయ్య అయినా వ్యక్తిగతంగా పెదరామయ్య... నాకెంతో గొప్పరామయ్య.
మెరుపు తీగలా కాజల్.. విషెస్ చెప్పినోళ్లకు థ్యాంక్స్ (ఫొటోలు)
చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తున్న భాగ్యశ్రీ (ఫొటోలు)
‘నాగబంధం’ మూవీ ట్రైలర్ ఈవెంట్లో మెరిసిన నభా నటేష్ (ఫొటోలు)
పరేడ్ గ్రౌండ్స్‌లో యోగా డే వేడుకలు.. ప్రముఖుల ఆసనాలు (ఫొటోలు)
నేను స్టేషన్ కి రాను.. వస్తే మీ బండారం బయటపెడతా!
Missing Case: చిన్నారి ఆచూకీ చెప్తే లక్ష రూపాయలు
జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. ఆ 15 నిమిషాలు ఏం జరిగింది?
సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. శ్మశాన వాటికలో పోలీసుల విచారణ
వినుకొండలో ఉద్రిక్తత.. బ్రహ్మనాయుడుని అడ్డుకున్న ఖాకీలు